47 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్‌!

నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్లో 47 ఎకరాలను అక్రమంగా 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయి.

Published : 27 Nov 2022 04:48 IST

నిషిద్ధ జాబితాలో భూములకు కొత్త నంబర్లతో దగా
అనుయాయుల పేర్లతో తప్పుడు రిజిస్ట్రేషన్లు
మొగల్తూరు సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు లీలలు

మొగల్తూరు, న్యూస్‌టుడే: నిషిద్ధ జాబితాలో ఉన్న భూముల్లో 47 ఎకరాలను అక్రమంగా 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్లద్వారా కోట్ల రూపాయలు చేతులు మారాయి. భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.25 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మొగల్తూరు సమీపంలోని 5 గ్రామాల్లోని తీరంలో ఉన్న విలువైన ఈ భూములను సబ్‌-రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు రిజిస్ట్రేషన్లు చేసేశారు. లేని సబ్‌ డివిజన్లు సృష్టించి, సర్వే నంబర్లకు అదనంగా అక్షరాన్ని చేర్చి ఈ అక్రమాల దందాను కొనసాగించినట్లు తెలిసింది. సబ్‌కలెక్టర్‌ సూర్యతేజ విచారణలో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. మొగల్తూరు మండలం శేరేపాలెం, పేరుపాలెం, కేపీపాలెం, రామన్నపాలెం, ముత్యాలపల్లి, కాళీపట్నం గ్రామాల పరిధిలో విలువైన భూములు ఉండటంతో అక్రమార్కులు కన్నేశారు. దీనికి సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు సహకరించి, వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. తహసీల్దార్‌ అనితా కుమారి ఈ రిజిస్ట్రేషన్ల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. దానికి స్పందన రాలేదు. సబ్‌-కలెక్టర్‌ సూర్యతేజ తహసీల్దార్‌ కార్యాలయానికి శుక్రవారం వెళ్లినప్పుడు జరిగిన విషయాన్ని తహసీల్దార్‌ చెప్పారు. ఆయన వెంటనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి, రికార్డులు తనిఖీ చేశారు. సెప్టెంబరు 1 నుంచి ఇటీవలి వరకు నిషిద్ధజాబితాలో ఉన్న 47 ఎకరాల భూములకు 111 డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు చేసినట్లు సబ్‌ కలెక్టర్‌ గుర్తించారు. నిషిద్ధ జాబితాలో ఉన్న డ్రెయిన్‌ పోరంబోకు, పంచాయతీ చెరువు భూములనూ రిజిస్టర్‌ చేశారు. రామన్నపాలెంలోని అడుగుపరలో ఉన్న దర్భరేవు డ్రెయిన్‌ పొడవునా ఉన్న 48 ఎకరాల పోరంబోకు భూమిలో 2.5 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ జరిగింది. మొగల్తూరులోని చెరువుభూమిని ఆక్రమించుకున్న స్థలాలకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. ముత్యాలపల్లి రెవెన్యూ గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న ఆర్‌ఎస్‌ నంబరు 460లోని 629.20 గజాల స్థలం, ఆ స్థలాల్లోని ఇళ్లను ఈ ఏడాది సెప్టెంబరు 22న నరసాపురంలో రిజిస్టర్‌ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూములకూ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది.

* ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌ (ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌) వెసులుబాటుతోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తెలిసింది. భీమవరం గ్రామీణ మండలం లోసరి, గూట్లపాడు తదితర గ్రామాల భూముల రిజిస్ట్రేషన్ల వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ప్రజాప్రతినిధి ఈ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


ఆది నుంచి వివాదాస్పదమే

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: సబ్‌రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు తీరు తొలి నుంచీ వివాదాస్పదమే. గతంలో ఉండిలో పని చేసి, ఈ ఏడాది జనవరిలో భీమవరం ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వచ్చారు. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. తర్వాత జూన్‌లో మొగల్తూరుకు బదిలీ అయినా భీమవరంలోనే కొనసాగేందుకు పైరవీలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో మొగల్తూరులో చేరారు. ఆయన వెళ్లగానే ఆ కార్యాలయ ఆదాయం 129% పెరిగి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఉన్న తణుకు (సజ్జాపురం) ఆదాయం 80%కే పరిమితమైంది. ఆయన ఉంటే పని అవుతుందని ఎక్కడెక్కడివారో మొగల్తూరు వెళ్లడం వల్లే అలా పెరిగిందన్న ఆరోపణలున్నాయి.

* భీమవరంలో ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడే గునుపూడి పరిధిలో నాన్‌ లేఅవుట్‌లోని 30 ఫ్లాట్లను ఒకేసారి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి.

* జీవన్‌బాబు పూర్వ తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో విధులు నిర్వహిస్తుండగా అంతకుముందు పనిచేసిన జంగారెడ్డిగూడెంలో దస్తావేజులు ట్యాంపరింగ్‌ చేసినట్లు విచారణలో బయటపడింది. దీంతో సస్పెండయ్యారు. తర్వాత మళ్లీ సర్వీసులో చేరారు.

* ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడు తన బంధువని ఆయన చెప్పుకోవడంతో చాలామంది అధికారులు ఆయన జోలికి వెళ్లేందుకు వెనకాడేవారు.

మొగల్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ జీవన్‌బాబు వ్యవహారంపై విచారణకు అధికారులు ఆదేశించారని, నివేదిక అందాక వారే చర్యలు తీసుకుంటారని భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌ సత్యనారాయణ తెలిపారు. జీవన్‌బాబుతో ఫోన్లో మాట్లాడేందుకు ‘న్యూస్‌టుడే’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు