విశాఖ అటవీశాఖ భూముల్లో ఆకస్మిక సర్వే

విశాఖ నగరంలోని అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది.

Updated : 28 Nov 2022 09:58 IST

తమ భూములున్నాయని ఒకరి దరఖాస్తు
చక్రం తిప్పిన కడప నేత  
వేగంగా స్పందించిన యంత్రాంగం
రూ.వందల కోట్ల భూముల కథ ఏమౌనో?

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరంలోని అటవీశాఖకు చెందిన విలువైన భూముల్లో అకస్మాత్తుగా సాగిన సర్వే కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు భూ కుంభకోణాలు విశాఖ వాసుల్లో చర్చనీయాంశమైన తరుణంలో సరికొత్తగా తెరపైకి వచ్చిన ఈ సర్వే వ్యవహారం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. కీలక అధికారులు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో సర్వే జరిగిపోవడం గమనార్హం. రూ.350 కోట్ల విలువైన 3.62 ఎకరాలను అటవీశాఖ కాపాడుకుంటుందా.. నేతలదే పైచేయిగా మారి పరుల పాలవుతుందా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. కడప ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారు.

ఆ నేత నేతృత్వంలోనే

విశాఖ నడిబొడ్డున మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు ఎదురుగా సిరిపురానికి వెళ్లే మార్గంలోని ఓ సర్వే నంబరులో దాదాపు 30 ఎకరాల భూమి ఉంది. ఇందులోనే ఆంధ్రా వర్సిటీకి, అటవీశాఖకు సంబంధించి భూములున్నాయి. ‘వన విహార్‌’ పేరుతో ఎన్నో సంవత్సరాలుగా పిలుస్తున్న ఈ ప్రాంతంలోనే చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు అధికారిక నివాసం ఉంది. ఇక్కడ తమకు దాదాపు 3.62 ఎకరాలున్నాయని 3 వారాల క్రితం ఓ మహిళ చేసిన దరఖాస్తు మేరకు జీవీఎంసీ సర్వే సిబ్బంది శనివారం మధ్యాహ్నం వచ్చారు. సదరు ఐఎఫ్‌ఎస్‌ అధికారి నివాసమున్న ప్రాంతంలోనే సర్వే జరిగింది. సర్వే సిబ్బంది అక్కడికి వచ్చే వరకూ అటవీశాఖ అధికారులకు సమాచారం లేదని చెబుతుండటం గమనార్హం. సర్వే ప్రక్రియ అంతా కడప ప్రాంతం నుంచి వచ్చిన ఓ నేత అనుచరుడి కనుసన్నల్లో సాగిందని సమాచారం. సర్వే పూర్తయ్యే వరకూ దరఖాస్తుదారుతోపాటు ఆ వ్యక్తి అక్కడే ఉన్నారు. తొలుత అటవీశాఖ సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేసినా వారు ఆగలేదు.

అనుమానాలెన్నో: దాదాపు ఆరు దశాబ్దాల క్రితం నుంచి తమ కుటుంబానికి ఇక్కడ భూములున్నాయని దరఖాస్తుదారు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లు ఏయూ, అటవీ భూములుగా వాటిని పేర్కొంటున్నా ఎందుకు రాలేదు? దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే జీవీఎంసీ సిబ్బంది చాలా వేగంగా స్పందించడానికి కారణాలేమిటి అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు వచ్చినప్పుడు దస్త్రాల్లో పరిశీలించాలి. ఇంకా అవసరం అనుకుంటే అటవీశాఖ నుంచి నివేదిక తెప్పించుకోవాలి. అలా చేయకుండా నేరుగా క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వే చేపట్టడం వెనుక కడపకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి ఉందనే మాట వినిపిస్తోంది. అందుకే అటవీశాఖ అధికారులు శనివారం స్పందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబును వివరణ కోరగా... ‘రెవెన్యూ అధికారులు సర్వే నిమిత్తం మా సిబ్బందిని పంపాలని కోరారు. ఎందుకని మేం అడగలేదు. సిబ్బందిని పంపించాం’ అని చెప్పారు. ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ను వివరణ కోరగా.. ‘సర్వే సిబ్బందిని పంపాలని జీవీఎంసీని మేము కోరలేదు’ అని చెప్పడం గమనార్హం.

దస్త్రాల్లో అటవీ భూమిగానే ఉంది: ‘వన విహార్‌లో ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన స్థలం ఉందన్న అభ్యర్థనకు సంబంధించిన అంశం ఆదివారమే మా దృష్టికి వచ్చింది. శనివారం క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగిందో తెలియలేదు. మా దృష్టికి వచ్చిన తరువాత ఆ స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించాం. ముందు నుంచి అటవీశాఖ పరిధిలోనే ఆ భూములున్నాయి. జీవీఎంసీకి చెందిన దస్త్రాల్లోనూ అలాగే ఉంది. మా దగ్గరున్న ఆధారాలు, పూర్తి వివరాలతో జీవీఎంసీ కమిషనర్‌కు సోమవారం నివేదిక పంపుతాం. కలెక్టరు దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్తాం’ అని విశాఖ జిల్లా అటవీ అధికారి అనంతశంకర్‌ తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని