Andhra News: అయ్యో పాపం.. ఎంత కష్టం!

అసలే నిరుపేద కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ పనికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి.

Updated : 28 Nov 2022 09:55 IST

ఇద్దరు మానసిక దివ్యాంగులతో నిరుపేద కుటుంబం అవస్థలు

కావలి, న్యూస్‌టుడే: అసలే నిరుపేద కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరూ పనికెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. దీనికితోడు లోకం తెలియని ఇద్దరు మానసిక దివ్యాంగుల సంరక్షణ భారం. దివ్యాంగులైన ఆ ఇద్దరికీ ప్రభుత్వపరంగా కనీసం పింఛను సాయమైనా అందకపోవడంతో ఆ కుటుంబ జీవనం అత్యంత భారంగా మారింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ముసునూరు గిరిజన కాలనీకి చెందిన కల్లూరి లక్ష్మీనారాయణ, వెంకటరమణ దంపతుల కుమారుడు అంకమరావు (12) మానసిక దివ్యాంగుడు. వెంకటరమణ తల్లిదండ్రులు, సోదరి కొన్నాళ్ల కిందట చనిపోవడంతో దివ్యాంగుడైన సోదరుడు శ్రీను (18)ను ఇంటికి తీసుకొచ్చి పోషిస్తున్నారు. వీరందరినీ పోషించేంత స్తోమత లేక.. దివ్యాంగుల సంరక్షణకు సంపాదన చాలక లక్ష్మీనారాయణ దంపతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. కనీసం తమ బిడ్డలకు పింఛను అయినా ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నా ఆలకించడం లేదు. కనిపించిన ప్రతి అధికారి, నాయకుడికీ వినతిపత్రాలిస్తున్నా ఎవరూ కనికరించడం లేదు.

కష్టతరంగా ఆధార్‌ నమోదు

మానసిక ఎదుగుదల లేని చిన్నారులకు ఆధార్‌ నమోదు కష్టతరంగా మారుతోంది. మానసిక  దివ్యాంగులు ఎక్కువ మందిలో చేతివేళ్లు చాలా సన్నగా ఉండడంతో వారి వివరాలు కంప్యూటర్‌లో నమోదవడం లేదు. ఐరిస్‌ ద్వారా వివరాలు సేకరిద్దామన్నా అంతంత మాత్రంగానే వీలవుతుంది. ఆధార్‌ నమోదు కాకపోతే పింఛను రాదు. జలుబు వంటి వాటి చికిత్సకు సంబంధించిన ఔషధాన్ని వీరికి వినియోగించి ఐరిస్‌లో వివరాలను సేకరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

మొబైల్‌ ఆధార్‌తో పరిష్కారానికి ప్రయత్నిస్తాం

- బి.శివారెడ్డి, కమిషనరు, కావలి పురపాలక సంఘం

మానసిక దివ్యాంగుల కుటుంబాలు సమాచారం తెలియజేస్తే మొబైల్‌ ఆధార్‌తో వారి ఇంటికి వెళతాం. అప్పటికీ ప్రయత్నాలు ఫలించకపోతే   జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతాం. గతంలో ఓ కేసును ఇలా పరిష్కరించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని