జయప్రదకు ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారం

ఎన్టీఆర్‌ భౌతికంగా లేకున్నా.. అందరి హృదయాల్లో ఉన్నారని, ఆయన పేరుతో చలనచిత్ర పురస్కారం తీసుకోవడం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని ప్రముఖ సినీనటి జయప్రద పేర్కొన్నారు.

Published : 28 Nov 2022 03:25 IST

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ భౌతికంగా లేకున్నా.. అందరి హృదయాల్లో ఉన్నారని, ఆయన పేరుతో చలనచిత్ర పురస్కారం తీసుకోవడం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయమని ప్రముఖ సినీనటి జయప్రద పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి మహోత్సవాల సందర్భంగా ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను చూస్తూ పెరిగిన తాను ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని పొందడం అదృష్టమని చెప్పారు. మళ్లీ జన్మలోనూ జయప్రదగానే పుట్టి, సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథి, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తు కోసం కుల, మత, పార్టీలకు అతీతంగా నచ్చిన వాళ్లకి ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన మునుగోడు ఎన్నికల ఖర్చు.. బ్రిటన్‌లో జరిగిన మొత్తం ఎన్నికల ఖర్చును మించిపోయిందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ రాకతో రాజకీయాలు, పాలనలో వచ్చిన అనూహ్యమైన మార్పులను ఆయన విశదీకరించారు. ప్రజాధనాన్ని వృథా కానివ్వని నేతగా కితాబిచ్చారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. మీతో సినిమా చేయకపోవడం దురదృష్టకరమని తాను చెబితే, మీవంటి యువ దర్శకులతో చేయలేకపోయానని వ్యాఖ్యానించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌ అని పేర్కొన్నారు. అనంతరం నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా ఎన్టీఆర్‌ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని జయప్రదకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నెట్టెం రఘురాం, ఎన్టీఆర్‌ అభిమాన సత్కార గ్రహీత మైథిలి అబ్బరాజు, మహ్మద్‌ సాబీర్‌ షా, డి.శారద తదితరులు పాల్గొన్నారు. తొలుత ఇటీవల మృతి చెందిన సూపర్‌స్టార్‌ కృష్ణకు అతిథులు నివాళులర్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని