శ్రమదోపిడీకి గురవుతున్న ఒప్పంద అధ్యాపకులు, ఉపాధ్యాయులు

ఒప్పంద లెక్చరర్లు, టీచర్ల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పలువురు వక్తలు డిమాండు చేశారు.

Published : 28 Nov 2022 03:18 IST

విద్యా వ్యవస్థను నాశనం చేసిన వైకాపా ప్రభుత్వం
రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు

విజయవాడ (అలంకార్‌ కూడలి), న్యూస్‌టుడే: ఒప్పంద లెక్చరర్లు, టీచర్ల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పలువురు వక్తలు డిమాండు చేశారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్లు, టీచర్ల ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీలు సాబ్జి, కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ... ‘ఒప్పంద అధ్యాపకులు, ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. వారు శ్రమ దోపిడికీ గురవుతున్నారు. అభద్రతా భావంతో పని చేస్తున్నారు. ఒప్పంద కాల పరిమితిని 12 నెలలుగా చూపాలి. 62 సంవత్సరాల వయసు వరకూ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి’ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే.. పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్లు, టీచర్ల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ బి.జె.గాంధీ మాట్లాడుతూ.. వయసు, సర్వీసుతో సంబంధం లేకుండా అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే.. హర్తాళ్‌ చేపట్టడం, విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని ప్రకటించారు. జిల్లాల్లో సదస్సులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించడం, మహిళలతో 36 గంటల ధర్నా తదితర కార్యక్రమాలకు సభ ఆమోదం తెలిపింది. అప్పటికీ ఫలితం లేకపోతే పాదయాత్ర చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని