సీఎం సారూ.. మాట తప్పారు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలకు.. జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదు.

Updated : 28 Nov 2022 09:17 IST

పరిహారం కోసం పోలవరం నిర్వాసితుల ఎదురు చూపులు
నెలలు గడుస్తున్నా అమలుకు నోచని హామీ

వేలేరుపాడు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీలకు.. జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేదు. వరద బాధితులను పరామర్శించేందుకు ఈ ఏడాది ఆగస్టు 27న ముఖ్యమంత్రి విలీన మండలాల పర్యటనకు వచ్చారు. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్టలో వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. రాష్ట్ర నిధులతోనైనా సెప్టెంబరు నెలాఖరుకల్లా 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి పునరావాస కాలనీలకు తరలిస్తామని చెప్పారు. హామీ ఇచ్చి రెండు నెలలు దాటినా నేటికీ నిర్వాసితులకు పరిహారం అందించక పోవడంతో విలీన మండలాల్లోని బాధితుల్లో నిరాశా నిస్పృహలు అలముకున్నాయి. 41.15 కాంటూరు పరిధిలో ఉన్న కుక్కునూరు, వేలేరుపాడు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాల్లోని గ్రామాల నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇంకా చెల్లించాల్సి ఉన్న (గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు, గిరిజనులకు రూ.6.86 లక్షలు) మొత్తాన్ని ఇచ్చి పునరావాస కాలనీలకు తరలిస్తామని హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేకపోవడంతో వేల కుటుంబాలు పిల్లాపాపలతో గుడారాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.


గుడారంలోనే కాలం వెళ్లదీస్తున్నాం

జులైలో గోదావరి వరదల కారణంగా పిల్లాపాపలతో దాచారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివెళ్లాం. వరదలు తగ్గుముఖం పట్టకపోవడంతో అక్కడ 2 నెలలు కాలం వెళ్లదీశాం. వరదలు తగ్గాక ఇంటికి వచ్చి చూస్తే పూరిల్లు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది. చేసేదిలేక గుడారంలోనే ఉంటున్నాం. ప్యాకేజీ గురించి ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్ముకున్నాం.

గుండారపు రాజమ్మ, రేపాకగొమ్ము


* ముంపు మండలాలు: 6

* 41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలు: 46

* 41.15 కాంటూరులోని నిర్వాసిత కుటుంబాలు: 9,000

* ఇప్పటి వరకు పరిహారం చెల్లించిన కుటుంబాలు:   3,500

* ఇంకా పరిహారం చెల్లించాల్సిన కుటుంబాలు:  5,500

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని