కొండగట్టుపై వైకాపా నేతల ఉడుంపట్టు

అది కొండగట్టు ప్రాంతం. రెవెన్యూ దస్త్రాల్లో కొండపోరంబోకుగా ఉంది. దీన్ని గ్రామ అవసరాలు, పశువుల మేతకు వినియోగించాలి.

Updated : 28 Nov 2022 07:35 IST

గోరంత అనుమతులతో కొండంత తవ్వకం  
తోటపల్లిలో రూ.కోట్ల అక్రమం

ఈనాడు, అమరావతి: అది కొండగట్టు ప్రాంతం. రెవెన్యూ దస్త్రాల్లో కొండపోరంబోకుగా ఉంది. దీన్ని గ్రామ అవసరాలు, పశువుల మేతకు వినియోగించాలి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే కన్నుపడింది. ఆయన కుమారుడు, మరో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. చకచకా అనుమతులు వచ్చేశాయి. మట్టిని తవ్వే బాధ్యతను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు అప్పగించారు. నేతలకు ఒక లారీకి రూ.2వేల వరకు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. జేసీబీలు, వాహనాలన్నీ ఆ సంస్థవే. ఇంకేం... కొన్ని లక్షల ఘనపు మీటర్ల మట్టి (గ్రావెల్‌)ని తవ్వేశారు. రూ.కోట్ల లబ్ధి పొందారు. ఇదేమిటని అడిగే అధికారులు లేరు. అక్రమాన్ని ప్రశ్నించిన గ్రామస్థులు మాత్రం దాడులకు గురయ్యారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా (ప్రస్తుతం ఏలూరు జిల్లా) పరిధిలోని తోటపల్లిలో అక్రమ తవ్వకాలతో వైకాపా ప్రజాప్రతినిధులు విధ్వంసం సృష్టించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు(నాటి), అధికార పార్టీ నేతలు తమ బినామీలతో రెవెన్యూ శాఖ ద్వారా ఎన్వోసీలు తీసుకుని, గనుల శాఖ నుంచి లీజు ఉత్తర్వులు పొందారు. జలవనరుల శాఖ నుంచి పోలవరం కట్టలకు తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. వాటిని ప్రముఖ సంస్థలకు విక్రయించుకున్నారు. కొందరు తమ సంస్థలతోనే తవ్వకాలు జరిపారు. నిబంధనలకు పాతరేసి, రూ.కోట్లు పోగేశారు. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో సర్వే నంబరు 02లో 679.23 ఎకరాల కొండగట్టు ప్రాంతం ఉంది. తొలుత సర్వే నంబరు ఆర్‌ఎస్‌2లో 30.78 ఎకరాలకు 2020 మే నెలలో ఒక శాశ్వత అనుమతిని పొందారు. ఈ లీజుతో నాలుగేళ్ల అయిదు నెలల వరకు తవ్వుకోవచ్చు. తర్వాత ఈ సర్వే నంబరును 2/1గా మార్చారు. 2022లో తాత్కాలిక అనుమతుల పేరిట 3 ఎకరాల్లో నాలుగు అనుమతులను ఒకే వ్యక్తి పేరిట ఇచ్చారు. ఒక్క అనుమతిని 36,432 ఘనపు మీటర్లకు ఇచ్చారు. అంటే మొత్తం మూడెకరాల్లో 1.46 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వాలి. కానీ... తవ్వకాలను దాదాపు 150 ఎకరాలకు పైగా విస్తరించారు. కొండను నామరూపాలు లేకుండా చేశారు. సాధారణంగా ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక మీటరు లోతులో తవ్వితే... 5వేల ఘనపు మీటర్ల మట్టి వస్తుంది. ఇక్కడ లోతు తీవ్రత, కొండ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటే... కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్లు తవ్వినట్లు కనిపిస్తోంది. అయినా దీనిపై గనుల శాఖ తనిఖీలు చేయకపోవడం గమనార్హం. ఒక లారీ గ్రావెల్‌ను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా రెండున్నరేళ్లుగా కొన్ని లక్షల ఘనపు మీటర్ల మట్టి తరలిపోయింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. నేరుగా వైకాపా నేతల ప్రమేయం ఉండటంతో ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. గ్రామస్థులను బెదిరించి కనీసం అటువైపు కన్నెత్తి చూడనీయలేదు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ప్రజాప్రతినిధి పక్షమే ఉండటంతో కనీసం ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయిందని వారు వాపోయారు.

పంటలపై ప్రభావం

నిత్యం వందలాది లారీలు తిరగడంతో దుమ్ముధూళి కమ్మేస్తోంది. సమీపంలోని పంటలపై తీవ్ర ప్రభావం పడింది. పశువుల మేతకు ఇబ్బంది కలిగింది. ధైర్యంచేసి పశువులను మేతకు తీసుకెళితే ప్రైవేటు సైన్యం దాడులు చేసేది. దీంతో గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు.


గ్రామం: తోటపల్లి, ఆగిరిపల్లి మండలం   (ఏలూరు జిల్లా)

సర్వే నంబరు: ఆర్‌ఎస్‌-02

విస్తీర్ణం: 12.318 హెక్టార్లు (30.78 ఎకరాలు)

కాలపరిమితి: నాలుగేళ్ల 5 నెలలు

సర్వే నంబరు: ఆర్‌ఎస్‌-02/1

విస్తీర్ణం: మూడు ఎకరాలు

అనుమతి: 36,423 ఘనపు మీటర్లు

కాలపరిమితి: నాలుగు తాత్కాలిక అనుమతులు

జరిగింది: ఇక్కడ కొండగట్టు మొత్తం విస్తీర్ణం  679.23 ఎకరాలు ఉండగా ఇప్పటికి దాదాపు 150 ఎకరాలకు పైగా తవ్వేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు