అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి

‘సమస్యల పరిష్కారానికి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం సహజమైనా... ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదు.

Updated : 28 Nov 2022 07:44 IST

ధర్నాలు, రాస్తారోకోలు తగదు
సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సూచన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘సమస్యల పరిష్కారానికి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం సహజమైనా... ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదు. మా దృష్టిలో ప్రభుత్వం, ఉద్యోగులు రెండూ వేరువేరు కాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చుని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి’ అని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ మహాజన సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడారు. ‘సమస్యలు, హక్కులపై పోరాడటంలో తప్పు లేదుగానీ బాధ్యతలను మరచిపోరాదు. ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కళ్లు, చెవుల్లాంటి వారు. ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి జరిగితే.. ఉద్యోగులు, సీఎం తలదించుకోవాలి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు.

సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు

‘అన్ని సమస్యలూ ఒక్క రోజులో పరిష్కారం కావు. సచివాలయ పోలీసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌ పాఠశాలలను తనిఖీ చేసేలా ఆదేశాలిస్తాం. శానిటేషన్‌ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు ప్రకటిస్తాం. పదోన్నతులు, సర్వీస్‌ రూల్స్‌కు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం’ అని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్వీస్‌రూల్స్‌, పదోన్నతులు, బదిలీలు, ప్రొబేషన్‌ ప్రకటనలో జాప్యంవల్ల సమస్యలు, పని ఒత్తిడి, భద్రతాపరమైన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి సంఘ నేతలు తీసుకెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేశ్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బొత్స అసహనం: కార్యక్రమం సుదీర్ఘంగా సాగడంపై బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. కొత్త కార్యవర్గం తమ సమస్యలను వివరిస్తుండగా ‘సభలో నీకు మైకిస్తే నీ ఇష్టం వచ్చినట్టు.. నాకు మైకిస్తే నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం’ అని వ్యాఖ్యానించారు. ‘సమస్యను పక్కదారి పట్టించడం, దానిని మర్చిపోయేలా చేయడంలో సమర్థులు’ అని మంత్రి బొత్సను ఉద్దేశించి బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని