అ.. ఆ..లతో మెదడులో మార్పులు: హెచ్‌సీయూ అధ్యయనంలో వెల్లడి

మనిషి మెదడుపై అక్షరాస్యత ప్రభావం చూపగలదా? వయోజనుల్లోనూ ఉచ్చారణలో మార్పు తెస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) పరిశోధకులు.

Published : 28 Nov 2022 09:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: మనిషి మెదడుపై అక్షరాస్యత ప్రభావం చూపగలదా? వయోజనుల్లోనూ ఉచ్చారణలో మార్పు తెస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) పరిశోధకులు. చదవడం, రాయడం నేర్చుకున్నప్పుడు మనిషి మెదడులో ఏయే మార్పులు చోటుచేసుకుంటున్నాయనే అంశంపై వర్సిటీ ఆచార్యులు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 91 మంది హిందీ మాట్లాడేవారిని ఎంచుకున్నారు. వీరిలో 22 మంది నిరక్షరాస్యులను ఎంపిక చేసి.. ఆరు నెలలపాటు హిందీ చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం మెదడు స్పందన తీరులోనే కాదు.. ఉచ్చారణలో, ఏకాగ్రతలోనూ కీలక మార్పులు వచ్చినట్లు గుర్తించారు. వయోజనులు మాట్లాడే భాషపై అక్షరాస్యత ఎలాంటి ప్రభావం చూపదని ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. హెచ్‌సీయూ పరిశోధనలో దీనికి విరుద్ధమైన ఫలితాలొచ్చాయి. అయితే ఈ ప్రభావం లిపిని బట్టి మారవచ్చని హెచ్‌సీయూలోని సెంటర్‌ ఫర్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ అధిపతి రమేశ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. ఆంగ్ల వర్ణమాలను పరిగణనలోకి తీసుకుంటే అక్షరాస్యత ప్రభావం పెద్దగా కనిపించడం లేదని.. దేవనాగరి లిపి వంటి వాటి విషయంలో కనిపిస్తోందని పేర్కొన్నారు.


అధ్యయనంలో పాల్గొన్నది వీరే..

హెచ్‌సీయూలోని సెంటర్‌ ఫర్‌ న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్సెస్‌ అధిపతి రమేశ్‌కుమార్‌ మిశ్ర, నెదర్లాండ్స్‌లోని మ్యాక్స్‌ ప్లాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సైకోలింగ్విస్టిక్స్‌ ఆచార్యుడు అలెక్సిస్‌ హెర్వాయిస్‌ అడెల్‌మాన్‌, లఖ్‌నవూలోని సెంటర్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఉత్తమ్‌కుమార్‌, అనుపమ్‌ గలేరియా, అలహాబాద్‌ యూనివర్సిటీలోని సెంటర్‌ ఆఫ్‌ బిహేవియరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌ ఆచార్యులు వివేక్‌ ఎ.త్రిపాఠి, జై పీ సింగ్‌, నెదర్లాండ్స్‌లోని రాబౌడ్‌ వర్సిటీలోని భాష అధ్యయన శాస్త్రాల కేంద్రం ఆచార్యుడు ఫాల్క్‌ హ్యుటిగ్‌ సంయుక్తంగా అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రం జర్నల్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌లో ప్రచురితమైంది.


Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు