‘ఆరోగ్య’ నిధులకూ మోకాలడ్డు!

కేంద్రం నుంచి జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా మెకాలడ్డుతోంది.

Published : 28 Nov 2022 04:50 IST

కేంద్రం ఇస్తున్నా విడుదల చేయని రాష్ట్రం
కొందరు ఉద్యోగులకు వేతనాల్లోనూ జాప్యం
బకాయిలు అందక గుత్తేదారుల అగచాట్లు
రోగులకు అన్నం పెట్టలేమని మొరాయింపు

ఈనాడు, అమరావతి: కేంద్రం నుంచి జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కింద వచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా మెకాలడ్డుతోంది. కిందటేడాది నుంచి చెల్లించాల్సిన బిల్లులు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. కొవిడ్‌ హయాంలో హడావుడిగా సరఫరా చేసిన పరికరాలు, సర్జికల్స్‌, ఇతర వస్తువులకు సంబంధించిన బిల్లుల కోసం గుత్తేదారులు ఇప్పటికీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులనూ ఇస్తున్నట్లు బీఆర్‌ఓలు విడుదల చేస్తోంది. వాటిని చూసి చెల్లింపులు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో కేంద్రం తన వాటా విడుదల చేస్తోంది. అయితే... నిధులు మాత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ వద్దే ఉండిపోతున్నాయి. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ గుత్తేదారుల ద్వారా ఆసుపత్రులకు ఔషధాలు, పరికరాలు, యంత్రాలు, సర్జికల్‌ ఐటమ్స్‌ను సరఫరా చేయిస్తోంది. మందులకు సంబంధించి రూ.163 కోట్లు, పరికరాలకు రూ.285 కోట్లు, నిర్మాణాలకు రూ.245 కోట్లు, ఇతర అవసరాల కింద మరికొన్ని కోట్ల రూపాయల వరకు వారికి చెల్లించాల్సి ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్యలో అక్టోబరు నుంచి వివిధ పీడీఎఫ్‌ ఖాతాల్లో ఉన్న రూ.674 కోట్లను ‘సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ’ పరిధిలోకి తెచ్చారు. ఇందులో కేంద్ర వాటాకు సంబంధించిన నిధులు 60% వరకు ఉన్నాయి. వాటి విడుదలకు ఆర్థిక శాఖ నుంచి వైద్య ఆరోగ్య శాఖకు కొర్రీలు పడుతున్నాయి. రూ.674 కోట్లలో రూ.400 కోట్లు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు చెందినవే. ఇవికాకుండా మరో రూ.330 కోట్ల విలువ కలిగిన బిల్లుల చెల్లింపు వివరాలను వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖకు పంపింది. బీఆర్వోల జారీతోనే ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. 

* ఎన్‌హెచ్‌ఎం కింద పనిచేసే మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ)కు జూన్‌ నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వడంలేదు. ఒక్కొక్కరికి కనీసం రూ.80,000 వరకు చెల్లించాల్సి ఉంది. వీరు 7,000 మంది వరకు ఉన్నారు. కొన్నిచోట్ల ఉప ఆరోగ్య కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. నిధులు రాక తామే అద్దెలు చెల్లిస్తున్నామని ఎంఎల్‌హెచ్‌పీలు చెబుతున్నారు.

* ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు అక్టోబరు వేతనాలను ఈ మధ్యే చెల్లించారు. ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య బృందాలు ఆసుపత్రులను సందర్శించే సమయానికి వేతనాల చెల్లింపులు జరగలేదు. దీనివల్ల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రాల్లో నిల్వ ఉన్న నిధుల నుంచి రూ.20 కోట్లను సర్దుబాటు చేశారు.

* వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో రోగులకు ఆహారాన్ని సరఫరా చేసే ఏజెన్సీలకు చాలాకాలం నుంచి కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. దీనివల్ల వారు రోగులకు అన్నం పెట్టలేమని, చేతులెత్తేయడం.. సూపరింటెండెంట్లు బుజ్జగించడం ఆనవాయితీగా మారింది.

* రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లోనూ జాప్యం జరుగుతోంది. ఈ సంస్థకు చెందిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక ఖాతాలో ఉన్నాయి.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు