‘మార్గదర్శి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తాం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అవకతవకలు గుర్తించామని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చెప్పారు.

Published : 29 Nov 2022 03:17 IST

ఆ సంస్థపై నిర్దిష్ట ఫిర్యాదులు మాత్రం రాలేదు
రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ వెల్లడి

ఈనాడు, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అవకతవకలు గుర్తించామని, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్‌ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చెప్పారు. చిట్‌ఫండ్స్‌ నిధులను నాన్‌-చిట్‌ఫండ్స్‌ కార్యకలాపాలకు మళ్లించినట్లు కనిపిస్తోందని, దానిపై ప్రత్యేక ఆడిట్‌, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహిస్తామని రామకృష్ణ సోమవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యకలాపాలపై నిర్దిష్టంగా ప్రజలనుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా.. మోసాలు జరిగేంత వరకు వేచి ఉండకూడదన్న ఉద్దేశంతో శాఖాపరంగా మిగిలిన చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో మాదిరిగానే మార్గదర్శి కార్యాలయాల్లోనూ తనిఖీలు చేసినట్లు తెలిపారు. మార్గదర్శి కార్యాలయాల్లో నిర్వహించిన తనిఖీల్లో గుర్తించిన లోపాలపై యాజమాన్యానికి వారం రోజుల్లో షోకాజ్‌ నోటీసు జారీచేసి, వివరణ కోరతామని తెలిపారు. మార్గదర్శి కార్యాలయాల్లో చేసిన తనిఖీల్లో.. వాటి మేనేజర్లు లేదా ఫోర్‌మెన్‌లకు అధికారాలు, చెక్‌పవర్‌ లేవని, వారికి ఇతర వివరాలేమీ తెలియవని గుర్తించినట్లు తెలిపారు. తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రధాన కార్యాలయంలో వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో లేదా 14, 15 తేదీల్లో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు రామకృష్ణ సమాధానం ఇస్తూ....‘మార్గదర్శి సంస్థ ఖాతాదారులను ఇబ్బంది పెట్టడం లేదు. మా చర్యల్లో ఎలాంటి వివక్ష లేదు. పూర్తి సమాచారం లేనందున ఎంత డిపాజిట్‌ మొత్తాన్ని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ నుంచి మళ్లించారో చెప్పలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.

అన్నీ అసత్యాలే..

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ చేసిన ఆరోపణలన్నీ అసత్యాలేనని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తున్న దాడిలో ఇది భాగమని పేర్కొన్నారు. 60 ఏళ్లుగా చట్టబద్ధంగా నడుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగానే ఈ దాడులకు తెగబడుతోందని వివరించారు. ఖాతాదారుల్లో అనుమానాలు రేకెత్తించి సంస్థ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతీయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నినట్లు ఈ విలేకరుల సమావేశంలో స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు. విశ్వసనీయతే ప్రాణంగా, లక్షల మంది ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడిగా నడుస్తున్న మార్గదర్శి సంస్థ.. ఈ ఆరోపణల్లోని అసత్యాలను, కుట్రకోణాన్ని ప్రజల ముందు ఉంచుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు