బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు

ఉద్యోగ సంఘాల నేతలకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.

Published : 29 Nov 2022 03:27 IST

ఈనాడు, అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఉద్యోగులు ఉద్యమాలు సాగించి మాత్రమే సౌకర్యాలు, జీతాలు పొందుతున్నారే తప్ప ఏ పాలకుడి కాళ్లు పట్టుకుని పొందలేదన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నాయి.


హక్కుల సాధనకే సంఘాలు

మంత్రి బొత్స వ్యాఖ్యలు ఆయన భూస్వామ్య అహంకార మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు పెట్టుకునేది హక్కుల సాధనకే. పోరాటాలు చేసి సాధించుకోవడమే తప్ప కాళ్లు పట్టుకోవడానికి కాదని గ్రహించాలి.

షేక్‌సాబ్జీ, ఎమ్మెల్సీ


వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం

మంత్రి బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలకు వెనుకాడబోం. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.

తిమ్మన్న, ప్రధాన కార్యదర్శి, రాష్ట్రోపాధ్యాయ సంఘం


ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అశాంతి

సమస్యలు సృష్టించి, ఉన్న ప్రయోజనాలు తొలగిస్తున్నందుకు ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అశాంతితో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం.

హృదయరాజు, చిరంజీవి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్‌(1987)


చిన్నచూపు తగదు

ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులే కనుక సమస్యలు పరిష్కారానికి వారు కూడా కాళ్లు పట్టుకోవాలని సందేశం ఇస్తున్నారా? ఉద్యోగుల పట్ల ఇంత చిన్నచూపు, వ్యతిరేకత ప్రదర్శించడాన్ని మానుకోవాలి.

మంజుల, భానుమూర్తి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఏపీటీఎఫ్‌


అలా మాట్లాడటం భావ్యం కాదు

పీఆర్సీ, ఐదు డీఏలు సక్రమంగా ఇవ్వకున్నా, ఉద్యోగులు దాచుకున్న డబ్బుని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా  ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. ఉద్యోగులను ఇలా తక్కువ చేసిన మాట్లాడటం భావ్యం కాదు.

మన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని