విభజన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయండి

రాష్ట్ర విభజనపై దాఖలైన వివిధ పిటిషన్లలో పిటిషనర్ల వినతి, వారు కోరుకుంటున్న ఉపశమనాలకు సంబంధించి సమగ్ర వివరాలను కూర్చి కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated : 29 Nov 2022 05:35 IST

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఫిబ్రవరి 22వ తేదీకి వాయిదా

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర విభజనపై దాఖలైన వివిధ పిటిషన్లలో పిటిషనర్ల వినతి, వారు కోరుకుంటున్న ఉపశమనాలకు సంబంధించి సమగ్ర వివరాలను కూర్చి కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజనపై దాఖలైన 27 పిటిషన్లపై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషన్లపై ధర్మాసనం ప్రశ్నించగా... మూడు రకాల పిటిషన్లు ఉన్నాయని న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. తమ పిటిషన్‌ విభజన హామీల అమలుకు సంబంధించినదన్నారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ జోక్యం చేసుకుంటూ విభజనకు సంబంధించిన కేసులు మొదట చూద్దామని, అవే ముఖ్యమైనవన్నారు. సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ... ‘రెండు రాష్ట్రాలు ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో విభజన కన్నా అందులో రాజ్యాంగ అంశాలపై విచారణ చేపడితే మేలు. రాజ్యాంగంలో రాష్ట్ర విభజనకు సాధారణ మెజారిటీ సరిపోతుందని, 2/3 మెజారిటీ కావాలని వేర్వేరు నిబంధనల్లో ఉంది. వీటిపై విచారణ చేపట్టాలి’ అని కోరారు. ఈ దశలో పిటిషనర్‌ ఇన్‌పర్సన్‌గా ఉన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన వాదనలు వినాలని కోరారు. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ మీరెవరని ప్రశ్నించగా... తాను మాజీ ఎంపీనని ఉండవల్లి బదులిచ్చారు. ఏ పార్టీ తరఫున అని మరోసారి జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఉండవల్లి బదులిస్తూ.. ‘కాంగ్రెస్‌ పార్టీ ఎంపీని. ఆ రోజే పార్టీ నుంచి బహిష్కరించారు. సభ నుంచి బయటకు పంపారు. బిల్లు ఆమోదం పొందింది’ అని తెలిపారు. మీ ఫిర్యాదు ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఉండవల్లి సమాధానం ఇస్తూ.. ‘విభజనకు ఎలాంటి విధానాన్ని అనుసరించలేదు. రాజ్యాంగ నిబంధనలు పాటించలేదు. రాజ్యాంగ విరుద్ధంగా చేశారు. విచారణ తర్వాత మీరు మార్గదర్శకాలు రూపొందించండి. ఇకనుంచైనా పార్లమెంటు ఇలాంటి విషయాల్లో రాజ్యాంగపరమైన గందరగోళానికి గురవకుండా చూడండి’ అని కోరారు. సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లకు పైగా అయింది. రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు దాన్ని ఏమీ చేయలేం.. అంతిమంగా మంచి, చెడు ఏం జరిగినా దానికి బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. రాష్ట్రాలు కేవలం స్వీకరించేవే. రాజకీయాలకు అనుగుణంగా విభజనపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు పిటిషన్లపై ఏం చేస్తాం’ అని ప్రశ్నించారు. వాదనల అనంతరం ధర్మాసనం ‘రాష్ట్ర విభజనపై దాఖలైన వివిధ పిటిషన్లలో పిటిషనర్ల వినతి, సమగ్ర వివరాలను కూర్చి కేంద్రప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలి. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేస్తున్నాం. దానికి వారం రోజుల ముందే కేంద్రం తన కౌంటరు సమర్పించాలి’’ అని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని