జగన్‌ కేసుల్లో ఇద్దరు మాజీ ఐఏఎస్‌ల పిటిషన్ల కొట్టివేత

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో మాజీ ఐఏఎస్‌ అధికారులు బి.పి.ఆచార్య, కృపానందం వేర్వేరుగా దాఖలుచేసిన మూడు క్వాష్‌ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

Updated : 29 Nov 2022 05:41 IST

బీపీ ఆచార్య, కృపానందంల వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో మాజీ ఐఏఎస్‌ అధికారులు బి.పి.ఆచార్య, కృపానందం వేర్వేరుగా దాఖలుచేసిన మూడు క్వాష్‌ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హెటిరో, అరబిందో, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌లకు భూకేటాయింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్యపై అభియోగాలను విచారణకు తీసుకుంటూ సీబీఐ కోర్టు వెలువరించిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు తీసుకోవడాన్ని సవాలు చేస్తూ రెండు కేసుల్లోనూ అప్పటి ఏపీఐఐసీ వీసీ, ఎండీగా పనిచేసిన బి.పి.ఆచార్య వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్లను కొట్టేస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతోపాటు భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో తనపై కేసును కొట్టేయాలని బి.కృపానందం దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, హెటిరో, అరబిందోల్లో నిందితుడుగా ఉన్న బి.పి.ఆచార్య దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. బి.పి.ఆచార్యపై 2012లో అభియోగపత్రం దాఖలు చేసినప్పుడు ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి లేనందున కేవలం ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలపై సీబీఐ కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసును కొట్టేయాలని ఆచార్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి, వాటిని 2021 సెప్టెంబరు వరకూ పొడిగిస్తూ వచ్చింది. 2016లో ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆచార్యపై రెండు కేసుల్లోనూ అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను విచారణకు తీసుకోవాలని సీబీఐ మెమో దాఖలుచేసింది. వీటిని సీబీఐ కోర్టు అనుమతించడంతో ఆచార్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి.. కేంద్రం ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందున విచారణకు తీసుకోవడం సమర్థనీయమేనన్నారు. ఈ అంశానికి సంబంధించి వి.డి.రాజగోపాల్‌ కేసులో ఇదే హైకోర్టు స్పష్టత ఇచ్చిందన్నారు.

విచారణకు ఈ సమాచారం చాలు: కృపానందం పిటిషన్‌పై హైకోర్టు

భారతి సిమెంట్స్‌ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ ఐఏఎస్‌ అధికారి బి.కృపానందం దాఖలుచేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పు వెలువరించారు. కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌కు లీజుల జారీలో కృపానందం అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ కృపానందంపై విచారణ కొనసాగించడానికి సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్న కారణాలు సరిపోతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని