రెండోరోజూ హైకోర్టు విధుల బహిష్కరణ

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ ప్రతిపాదనపై రెండోరోజు సోమవారం హైకోర్టులో నిరసనలు కొనసాగాయి.

Published : 29 Nov 2022 03:33 IST

ఈనాడు, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ల బదిలీ ప్రతిపాదనపై రెండోరోజు సోమవారం హైకోర్టులో నిరసనలు కొనసాగాయి. న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బదిలీలను నిలిపేసే వరకు నిరసనలు నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ‘ఏపీ అడ్వొకేట్స్‌ ఐకాస’ ఏర్పడింది. ఈ కమిటీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయంలో హైకోర్టు వద్ద నిరసనలు చేయాలని తీర్మానించింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రను మంగళవారం కలిసి.. బదిలీలను నిలిపివేసేలా సుప్రీంకోర్టు కొలీజియంను కోరాలని విజ్ఞప్తి చేయాలని తీర్మానించారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కొలీజియం సభ్యులను కలవాలని నిర్ణయించారు.

బహిష్కరణకు సహకరించాలని విజ్ఞప్తి

కొందరు న్యాయవాదులు అందరినీ విధుల బహిష్కరణకు సహకరించాలని కోరారు. అదే విషయాన్ని న్యాయమూర్తులకు తెలియజేశారు. ఇదే సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) వై.నాగిరెడ్డి స్పందిస్తూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఏపీ బార్‌ కౌన్సిల్‌ నిరసనల కార్యక్రమాలకు పిలుపు ఇవ్వలేదని కొందరు న్యాయమూర్తులకు తెలిపారు. వాగ్వాదం చోటుచేసుకుని కొన్ని కోర్టు హాళ్లలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో న్యాయమూర్తులు బెంచ్‌లు దిగిపోయారు.

గొడవలు చేస్తే ఉపేక్షించం: సీజే హెచ్చరిక

రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ అమలు చేయలేదంటూ రైతులు వేసిన కోర్టుధిక్కరణ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఈ సమయంలో న్యాయవాదుల ప్రతినిధిగా వాసిరెడ్డి ప్రభునాథ్‌ విధులను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. పీపీ వై.నాగిరెడ్డి తాము బహిష్కరించడం లేదని తెలిపారు. కొలీజియం నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రభునాథ్‌, సమర్థిస్తున్నట్లు నాగిరెడ్డి చెప్పారు. వీరిమధ్య వాగ్వాదంపై సీజే తీవ్రంగా స్పందించారు. ‘మేము ఉన్నది కక్షిదారులకు న్యాయం చేయడం కోసం. బెంచ్‌ దిగిపోం. న్యాయవాది విధులకు హాజరుకాకపోతే అందులో వ్యతిరేక ఉత్తర్వులు మాత్రం ఇవ్వం. కోర్టు హాల్లో ఇలాంటి గొడవలను ఉపేక్షించబోం. కోర్టులో సర్కస్‌ చేయొద్దు. కోర్టు సిబ్బందితో ఉల్లంఘనలకు పాల్పడినవారిని గుర్తించి కోర్టుధిక్కరణ చర్యలు ప్రారంభిస్తాం. కోర్టులో ఫైటింగ్‌ వద్దు’ అని తేల్చిచెప్పారు. రాజధాని వ్యాజ్యాలపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసి బెంచ్‌ దిగిపోయారు. మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు కోర్టుహాలులోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆయనా ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు