నీళ్లిస్తామన్నారు.. చేతులెత్తేశారు

హంద్రీ నీవా(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాల్వ కింద ఉన్న రైతులతో ప్రభుత్వం, అధికారులు ఆడుకుంటున్నారు.

Updated : 29 Nov 2022 05:30 IST

హంద్రీ నీవా కింద సాగుచేసిన కర్నూలు, అనంత రైతుల ఆవేదన
మంత్రి హామీతో కర్నూలులో వేరుశనగ సాగు
అనంతలోనూ హంద్రీ నీవా కాల్వ కింద మిర్చిపంట
డిసెంబరు వరకే నీటి సరఫరా అంటున్న అధికారులు

ఈనాడు, కర్నూలు, ఉరవకొండ-న్యూస్‌టుడే: హంద్రీ నీవా(హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కాల్వ కింద ఉన్న రైతులతో ప్రభుత్వం, అధికారులు ఆడుకుంటున్నారు. ప్రభుత్వం రూ.2,343 కోట్ల విద్యుత్తు బిల్లులు చెల్లించని కారణంగా నీటి సరఫరా నిలిపేయడంతో ఖరీఫ్‌లో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు పంటలు తొలగించి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వ కింద రబీలో కొత్తగా పంటలు వేశారు. అధికారులేమో డిసెంబరు వరకే నీరిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

రూ.కోట్ల ఖర్చు వెనక్కి వచ్చేనా...?

ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కరివేములలో అక్టోబరు 29న జరిగిన ‘గడప గడపకు’ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. నాడు రైతులు సాగునీటి సమస్యను వివరించగా.. మార్చి నెలాఖరు వరకు హంద్రీనీవాకు నీటి సరఫరా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. దాంతో కాల్వ పరిధిలోని కృష్ణగిరి, దేవనకొండ, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలో సుమారు 40 వేల ఎకరాల్లో వేరుశనగ వేశారు. విత్తనాలకే రూ.60 కోట్లు, సాగుకు రూ.20 కోట్లు ఖర్చు చేశారు. పంట ప్రస్తుతం మొలక దశలో ఉంది.

* హంద్రీ నీవా పరిధిలో అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది. ఒక్కో రైతు ఎకరాకు ఇప్పటి వరకు రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. ఈ పంటలకు జనవరి అత్యంత కీలక దశ. డిసెంబరు వరకే నీరిస్తే పంటపై తీవ్ర ప్రభావం పడుతుంది. రూ.300 కోట్ల పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ఇక్కడ వేరుశనగ 20 వేల ఎకరాల్లో సాగు చేశారు. డిసెంబరులో నీటి సరఫరా ఆగిపోతే రైతులు నష్టాల్లో కూరుకుపోయినట్లే.. 5 వేల ఎకరాల్లో పత్తి కూడా ఉంది.

శ్రీశైలంలో రోజుకు 5 టీఎంసీల నీరు తగ్గుదల

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 810 అడుగుల వరకు ముచ్చుమర్రి నుంచి, 834 అడుగుల వరకు మల్యాల నుంచి హంద్రీనీవాకు నీటిని తీసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీశైలం నీటి మట్టం 872.30 అడుగులకు చేరింది. జలాశయంలో ఉభయ రాష్ట్రాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తుండటంతో నిత్యం 5 టీఎంసీల నీరు తగ్గుతోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి 834 అడుగుల నీటిమట్టం కంటే తక్కువకు నిల్వలు చేరుతాయని, ఫలితంగా హంద్రీనీవాకు నీళ్లు నిలిచిపోతాయని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి విపత్కర సమయాల్లో... ముచ్చుమర్రి వద్ద శ్రీశైలంలో 790 అడుగుల నుంచీ నీళ్లు తీసుకునేలా రూ.20 కోట్లతో చేపట్టిన అప్రోచ్‌ కాల్వ పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఇది సైతం రైతులకు శాపంగా మారింది.


మార్చి వరకూ నీరివ్వాల్సిందే

- హంద్రీ నీవా రైతుల రహదారి దిగ్బంధనం

దేవనకొండ, న్యూస్‌టుడే: హంద్రీ నీవా నుంచి సాగు నీటిని మార్చి నెలాఖరు వరకు విడుదల చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా దేవనకొండ సమీపంలోని కర్నూలు-బళ్లారి రహదారిని రైతులు సోమవారం దిగ్బంధనం చేశారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ... మంత్రి మాటపై నమ్మకంతో సాగు చేపట్టిన రైతులకు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు. మార్చి వరకు నీటి సరఫరా కొనసాగకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రహదారిపై రైతులు బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచాయి. కార్యక్రమంలో తెదేపా, సీపీఎం, జనసేన, సీపీఐ, కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌, లోక్‌సత్తా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని