రామాలయ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి

భద్రాచాలం సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురషోత్తపట్నంలోని భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

Updated : 29 Nov 2022 05:29 IST

ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: భద్రాచాలం సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురషోత్తపట్నంలోని భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. వాటిలో పొలాలను ఏళ్ల తరబడి ఆక్రమించి సాగుచేసుకుంటున్నవారు ఆలయానికి పరిహారం (డ్యామెజ్‌స్‌ ఛార్జెస్‌) చెల్లించాల్సిందేనని, మూడేళ్లకు ఓసారి దీనిని 30 శాతం పెంచాలని ఆదేశించారు. వీటిని చెల్లించబోమనే వారిని ఖాళీ చేయిస్తామన్నారు. భద్రాచలం రామాలయ భూముల్లో ఆక్రమణలపై ఆయన సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌, అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌, సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, అల్లూరి జిల్లా జేసీ శివ శ్రీనివాస్‌, తెలంగాణ దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ జ్యోతి, భద్రాచలం ఆలయ ఈవో శివాజీనాయక్‌, ఆలయ భూములు సాగుచేసుకుంటున్న రైతుల తరపున 15 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ భూముల్లో 20 వరకు ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వీటిని కూల్చేయాలని జేసీని ఆదేశించారు. ఈ సందర్భంగా సాగుభూములకు డ్యామెజ్‌ ఛార్జీలపై రైతులతో చర్చించారు. గతంలో వీటిని చెల్లించేవారని, ఇపుడు అదే విధానం పాటించాలని మంత్రి వారికి తెలిపారు. దీనికి అంగీకరించబోమని కొందరు రైతులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోగా, మిగిలిన రైతులు ఆలయ అధికారులు నిర్ణయించే మొత్తం చెల్లించేందుకు అంగీకరించారు. వీటికి సంబంధించి అల్లూరి జిల్లా జేసీ ఆధ్వర్యంలో అక్కడి కలెక్టర్‌ ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని