Amaravati: సుప్రీం తీర్పుతోనైనా కనువిప్పు కలగాలి: రాజధాని రైతులు

అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని రాజధాని రైతులు అన్నారు.

Updated : 29 Nov 2022 09:13 IST

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని రాజధాని రైతులు అన్నారు. ‘ఏపీ విభజన చట్టంలో ఒక రాజధాని అని మాత్రమే ఉంది. రాజధానిపై పార్లమెంటు చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా మార్చగలదు. రైతులకు చట్టబద్ధంగా ఇచ్చిన హామీని ఎలా ఉల్లంఘిస్తారు’ అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావించారు. డిసెంబర్‌ 17 నాటికి ఉద్యమం మూడు సంవత్సరాలకు చేరుకుంటున్న సందర్భంగా దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ఆంధ్రులంతా ఒక్కటై అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1077వ రోజుకు చేరాయి. సోమవారం తుళ్లూరులో స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా జ్యోతిరావు ఫులె వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రైతులు, రైతుకూలీలు, మహిళలు నివాళులర్పించారు. వెంకటపాలెంలో మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, దొండపాడు, తుళ్లూరు, నీరుకొండ, కృష్ణాయపాలెం, నెక్కల్లు, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

రాజధాని అమరావతిపై వివాదాలకు తెరదించాలి: సీపీఐ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి అంశంలో సుప్రీం కోర్టు చేసిన సూచనలను గౌరవించైనా ప్రభుత్వం రాజధాని వివాదానికి తెరదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ‘అమరావతి విషయంలో అభ్యంతరాలుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై పూర్తి స్థాయి స్టే విధించాలని ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరగా స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అంటే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం మోసమే’ అని రామకృష్ణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని