ఆక్వా రైతుకు అండ ఏదీ!

రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతులకు.. ఇప్పుడు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. ఉత్పత్తిని కొనేవారు లేక పడరాని పాట్లు పడుతున్నారు.

Updated : 29 Nov 2022 05:28 IST

స్థిరీకరణ ‘నిధి’ నుంచి ఆదుకోవచ్చు
పట్టించుకోని ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన రైతులకు.. ఇప్పుడు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. ఉత్పత్తిని కొనేవారు లేక పడరాని పాట్లు పడుతున్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని రెండు, మూడు నెలలుగా గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం సాచివేత ధోరణికే పరిమితమవుతోంది. ధరల స్థిరీకరణ ‘నిధి’ని బయటకు తీయడం లేదు. ఆక్వా రైతుల్ని ఆదుకునేందుకు చర్యలూ చేపట్టడం లేదు. ఇప్పుడే కాదు, ధరలు దక్కడం లేదని, నష్టపోతున్నామని కూరగాయ పంటల్ని సాగు చేసే రైతులు తమ పొలాల్ని పశువులకు వదిలేస్తున్నా.. తక్షణం భరోసా అందించే చర్యలు కొరవడ్డాయి. అధికశాతం రైతులు తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయాకే.. కొనుగోలుకు అనుమతిస్తోంది. 2019 సంవత్సరంలో సెనగ రైతులకు సాయం నుంచి.. ఇప్పుడు ఆక్వా సంక్షోభం వరకు ప్రతిచోటా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పేరుకే రూ.3వేల కోట్ల స్థిరీకరణ అంటూ మాటలు తప్పితే.. ఆదుకుందామనే ఆలోచనే కొరవడిందని రైతులు మండిపడుతున్నారు. పంట ఉత్పత్తుల సేకరణలో ముందస్తు సన్నద్ధత అనేదే లేదని, అరకొర సాయంతో సరిపెట్టే ధోరణితోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అసంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది.

ఆదుకోలేని ‘నిధి’ ఎందుకు?

ధరల పతనం, దాణా ధరల పెరుగుదల తదితర సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం మంత్రులతో సాధికార కమిటీ ఏర్పాటు చేసింది. వారు వంద కౌంట్‌ రొయ్యను కిలోకి రూ.210 చొప్పున కొనాలంటున్నా.. రైతుకు రూ.170 నుంచి రూ.190 కూడా దక్కడం లేదు. ఆ ధరకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. రొయ్య ఎక్కువ రోజులు చెరువులో ఉంటే.. ఖర్చు పెరగడంతోపాటు వ్యాధులు ఆశిస్తే మొత్తం పెట్టుబడే కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం చూస్తే రైతులకు కిలోకు రూ.100 వరకు నష్టపోతున్నారు. ఆక్వా రంగానికి గతంతో పోలిస్తే రాయితీలు తగ్గిపోయాయని, విద్యుత్తు భారమూ పెరిగిందని.. ధరల స్థిరీకరణ నిధి కింద ఆర్థిక సహకారం అందిస్తే కొంతైనా నష్టాలు తగ్గే వీలుంటుందని ఆక్వా రైతులు చెబుతున్నారు.


ఏటా కేటాయింపులే...

ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం 2019-20లో రూ.3వేల కోట్లు కేటాయించి రూ.351 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అందులో సెనగ రైతులకు సాయం కింద అందించిన రూ.120 కోట్లు, ఆయిల్‌పామ్‌ రైతులకు ధరలో తేడా కింద రూ.80 కోట్లు మినహాయిస్తే.. పంటల కొనుగోలుకు రూ.151 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2020-21లోనూ రూ.3వేల కోట్లు కేటాయించి రూ.524 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పంట ఉత్పత్తుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌కు ఇవ్వాల్సిన మొత్తమూ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంది. ఇంకా రూ.650 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. రైతులకు స్థిరీకరణ నిధి ద్వారా ఎలాంటి ప్రయోజనాలందుతున్నాయో చెప్పేందుకు సెనగ రైతులకు సాయమే ఉదాహరణ. 2019లో ధర వ్యత్యాస పథకం కింద రూ.330 కోట్లు కేటాయించింది. క్వింటాకు రూ.1,500, ఎకరాకు 6 క్వింటాళ్ల చొప్పున ఒక్కో రైతుకు గరిష్ఠంగా ఐదెకరాల వరకు సాయం చేస్తామని ప్రకటించింది. అంటే ఒక్కో రైతుకు రూ.45వేల వరకు అందుతాయి. అయితే తర్వాత రకరకాల నిబంధనల పేరుతో లబ్ధిదారుల సంఖ్యలో కోత పెట్టింది. రూ.120 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని