గోతాలివ్వడం లేదు.. కొనుగోలు చేయడం లేదు

ధాన్యం కొనుగోలులో నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, సరిపడా గోతాలు ఇవ్వడం లేదని, వెంటనే సేకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణా జిల్లా పామర్రు మండలంలో రైతులు రోడ్డెక్కారు.

Published : 29 Nov 2022 04:54 IST

ధాన్యం సేకరణలో నిబంధనలపై రైతుల రాస్తారోకో

జమీగొల్వేపల్లి (పామర్రు గ్రామీణం), పామర్రు, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలులో నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, సరిపడా గోతాలు ఇవ్వడం లేదని, వెంటనే సేకరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కృష్ణా జిల్లా పామర్రు మండలంలో రైతులు రోడ్డెక్కారు. సోమవారం జమీగొల్వేపల్లి అడ్డరోడ్డు కూడలి వద్ద పామర్రు-దిగమర్రు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు పంపినా వెంటనే దిగుమతి చేసుకోవడం లేదని, రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు. మబ్బులు కమ్మి, అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయని ఆవేద]న వ్యక్తంచేశారు. జమీగొల్వేపల్లి, కొమరవోలు గ్రామాల నుంచి మహిళా రైతులు తరలివచ్చి బైఠాయించారు. ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచింది. పామర్రు సీఐ వెంకట నారాయణ, తహసీల్దారు భరత్‌రెడ్డి అక్కడకు వచ్చి రైతులతో మాట్లాడినా వినలేదు. దీంతో పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో గుడివాడ వైపు నుంచి పామర్రు వైపు వెళుతున్న ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఒకేసారి నూర్పిళ్లు కావడంతో కొనుగోలులో జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం నూర్పిడి చేసిన ధాన్యం మొత్తాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలిస్తామని, రవాణా కాంట్రాక్టర్‌ను కూడా మారుస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

రైతుల వద్ద నుంచి ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ ఎండీ వీరపాండ్యన్‌ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాంకేతిక సమస్య తలెత్తడంతో రైతులకు కొంత ఇబ్బంది కలిగింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ధాన్యం చూపించి తేమ శాతాన్ని నమోదు చేయించుకోవాలి. అవి ఏ మిల్లుకు పంపాల్సిందీ ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది. ఆ మిల్లర్లకు మేమే పంపించి గిట్టుబాటు ధర వచ్చేలా చూసి 21 రోజుల్లో సొమ్మును, కూలి ఖర్చు కూడా కలిపి వారి ఖాతాల్లో జమ చేస్తాం. ప్రతి మిల్లులో ఉప తహసీల్దార్‌ స్థాయి కస్టోడియన్లను నియమించాం’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని