తప్పులతడకగా భూముల సర్వే

రాష్ట్రంలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు.

Published : 29 Nov 2022 04:54 IST

ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదు
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం’ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. రైతుల వద్ద ఉన్న దస్త్రాలకు, డిజిటలైజేషన్‌లో నమోదు చేసిన వివరాలకు పొంతన కుదరడం లేదని మండిపడ్డారు. ఒకరి భూమి, మరొకరి పేరుతో నమోదవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. లోపాలను సరిదిద్దాలని కోరుతూ విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను సోమవారం రైతు నాయకులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం వడ్డే విలేకరులతో మాట్లాడారు. ‘చాలాచోట్ల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వారి హక్కు పత్రాలను పరిశీలించకుండా వివరాలు నమోదు చేస్తున్నారు. చట్టాలపై పూర్తిస్థాయి అవగాహన లేని వీఆర్‌వోలు, సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో డిజిటలైజేషన్‌ తప్పులతడకగా మారింది. దాంతో రైతులు, భూయజమానులు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. 1954కు ముందు ప్రభుత్వం పేదలకిచ్చిన భూములు, 12 ఏళ్లకు మించి సాగు చేస్తున్న భూములను క్రమబద్ధీకరించాలని న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలూ అమలవడం లేదు’ అని శోభనాద్రీశ్వరరావు వివరించారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచాలని, తేమ శాతం పేరుతో మిల్లర్లు రైతుల్ని దోచుకుంటున్నారని గవర్నర్‌కు విన్నవించామన్నారు. వీటిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, రైతు నాయకులు చిట్టిబాబు, నాగేంద్రనాథ్‌, వై.కేశవరావు, సుందరరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని