కొత్త సీఎస్‌ జవహర్‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్‌ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.

Published : 30 Nov 2022 03:20 IST

సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాష్‌
మధుసూదన్‌రెడ్డికి వ్యవసాయ, సహకార శాఖలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. 2024 జూన్‌ వరకు ఈ పోస్టులో కొనసాగనున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలంలోని కసునూరు గ్రామానికి చెందిన ఆయన 1990లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ అనేక కీలక శాఖల్లో పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్‌ జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా కెరీర్‌ మొదలైంది. మహబూబ్‌నగర్‌, నర్సాపురం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా, భద్రాచలం ఐటీడీఏ పీవోగా, నల్గొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేశారు. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు కలెక్టర్‌గా పని చేశారు. హైదరాబాద్‌లో మెట్రో వాటర్‌ సర్వీసెస్‌ ఎండీగా, హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వీసీగా, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 అక్టోబరు నుంచి 2014 ఫిబ్రవరి వరకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. రాష్ట్ర విభజన అనంతరం నీటి పారుదల, పంచాయతీరాజ్‌శాఖలకు ముఖ్య కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, తితిదే కార్యనిర్వహణాధికారిగా వ్యవహరించారు.

ఆ తర్వాత జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన, 2021 నవంబరు 20 నుంచి ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

సీఎంవోకి పూనం మాలకొండయ్య

రాష్ట్ర ప్రభుత్వం కొందరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న జవహర్‌రెడ్డిని కొత్త సీఎస్‌గా నియమించడంతో ఆయన స్థానంలో పూనం మాలకొండయ్యను సీఎంవోకు పంపింది. ఆమె ప్రస్తుతం వ్యవసాయ, సహకారశాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటివరకు ఆమె చూస్తున్న శాఖల్ని... పూర్తి అదనపు బాధ్యతగా అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌గా పని చేస్తున్న మధుసూదన్‌రెడ్డికి అప్పగించింది. ఇప్పటివరకు పూనం పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్న పశు సంవర్థక, మత్స్య, పరిశ్రమలు (చక్కెర) శాఖల బాధ్యతనూ మధుసూదన్‌రెడ్డికే అప్పగించింది. రవాణా, రోడ్లు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌ను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బి.రాజశేఖర్‌ సెలవుపై విదేశాలకు వెళుతున్నారు. సెలవు నుంచి తిరిగొచ్చాక పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆయనకు ప్రభుత్వం సూచించింది. మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీగా ఉన్న పి.ఎస్‌.ప్రద్యుమ్నను రవాణా, రోడ్లు భవనాలశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి రాహుల్‌ పాండేని మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌గా నియమించింది. మార్క్‌ఫెడ్‌ ఎండీ పోస్టును ఆయనకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి బి.మహ్మద్‌ దివాన్‌ మైదీన్‌ను గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది.


ఆ ముగ్గురూ వైయస్‌ఆర్‌ జిల్లావారే

రాష్ట్రంలో అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పోస్టుల్లో ఉన్న ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వగ్రామం వైయస్‌ఆర్‌ జిల్లాలోని సింహాద్రిపురం మండలం బలపనూరు. కొత్త సీఎస్‌ జవహర్‌రెడ్డి అదే మండలానికి చెందినవారు. ఆయనది సింహాద్రిపురం మండలంలోని కసునూరు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి స్వగ్రామం రాజుపాలెం మండలంలోని పల్లంపాడు. ఇలా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి, పోలీసుశాఖకు సారథులుగా ఉన్న ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి, ఒకే జిల్లాకు చెందినవారవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే... సీఎస్‌గా జవహర్‌రెడ్డిని నియమించిన నేపథ్యంలో డీజీపీని మార్చే అవకాశముందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని