సీఎంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా సమీర్‌శర్మ

ముఖ్యమంత్రికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌... ఇలాంటి పదవి ఒకటి ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎక్కడైనా అలాంటి పదవి ఉందని మీకు ఎవరైనా చెప్పారా? ప్రభుత్వ సలహాదారు పదవుల్ని పప్పుబెల్లాల్లా పంచేస్తున్న జగన్‌ ప్రభుత్వం... సర్వీసులో ఉండగా అత్యంత విధేయంగా పని చేసిన అధికారులకు పునరావాసం కల్పించేందుకు ఇలాంటి వింత పోస్టుల్ని సృష్టిస్తోంది.

Published : 30 Nov 2022 03:20 IST

కొత్త పోస్టును సృష్టించిన ప్రభుత్వం
కాలుష్య నియంత్రణ మండలికి పూర్తికాల ఛైర్మన్‌గానూ బాధ్యతలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌... ఇలాంటి పదవి ఒకటి ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? పోనీ ఎక్కడైనా అలాంటి పదవి ఉందని మీకు ఎవరైనా చెప్పారా? ప్రభుత్వ సలహాదారు పదవుల్ని పప్పుబెల్లాల్లా పంచేస్తున్న జగన్‌ ప్రభుత్వం... సర్వీసులో ఉండగా అత్యంత విధేయంగా పని చేసిన అధికారులకు పునరావాసం కల్పించేందుకు ఇలాంటి వింత పోస్టుల్ని సృష్టిస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా నియమితులైంది ఎవరో కాదు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సమీర్‌ శర్మ. ఆయనను ఈ పోస్టుతోపాటు, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి పూర్తికాల ఛైర్మన్‌గానూ నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా ఆయన మూడేళ్లపాటు పని చేస్తారంది. నవంబరు 21న జరిగిన సెలక్షన్‌ కమిటీ... వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి, కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌ అయ్యేందుకు అవసరమైన అర్హతలన్నీ సమీర్‌ శర్మకే ఉన్నాయని నిర్ధారించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇక ముఖ్యమంత్రికి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా సమీర్‌ శర్మ ఎక్స్‌ అఫీషియో చీఫ్‌ సెక్రటరీ హోదాలో సీఎం కార్యాలయంలో పని చేస్తారని తెలిపింది.

ఆయన విధులివీ..

రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా అన్నిశాఖలు, సంబంధిత అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందించి, కార్యక్రమాలను అమలు చేస్తారు. కాలానుగుణంగా ముఖ్యమంత్రికి నివేదికలు, ప్రజంటేషన్లు ఇస్తారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచికల సాధనలో అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరును అంచనా వేయడంలో ముఖ్యమంత్రికి సహకారం అందిస్తారు. రాష్ట్ర జీఎస్‌డీపీ పెంచేందుకు అన్ని శాఖల అధికారులతో కలిసి బాధ్యతలు నిర్వహిస్తారు.

ప్రణాళికశాఖ సీఈవోగా విజయ్‌ కుమార్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళిక సొసైటీ సీఈవో, ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌ కుమార్‌ను ప్రభుత్వం పునర్నియమించింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. అదే పదవిలో మరో ఏడాదిపాటు కొనసాగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని