Viveka Murder Case: ఎంత పరువు తక్కువ!

రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఇంత కంటే తలవంపులు, అప్రతిష్ఠ ఇంకేమీ ఉండవేమో..! ముఖ్యమంత్రి జగన్‌ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా జరిగే అవకాశం కనిపించడం లేదంటూ... కేసు విచారణను సుప్రీంకోర్టు పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రానికి ఎంత పరువు తక్కువ!

Updated : 30 Nov 2022 07:57 IST

అధికారంలో ఉన్నవారివల్లే దర్యాప్తుపై సుప్రీంకోర్టు అనుమానాలు
సీఎం బాబాయి హత్యకేసు విచారణ పక్క రాష్ట్రానికి వెళ్లడం అప్రతిష్ఠేనంటున్న ప్రతిపక్షాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి ఇంత కంటే తలవంపులు, అప్రతిష్ఠ ఇంకేమీ ఉండవేమో..! ముఖ్యమంత్రి జగన్‌ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా జరిగే అవకాశం కనిపించడం లేదంటూ... కేసు విచారణను సుప్రీంకోర్టు పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రానికి ఎంత పరువు తక్కువ! బాధితుల పక్షాన నిలబడి, వారికి న్యాయం చేయకుండా.... ప్రభుత్వానికి, అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసు అధికారులకు సుప్రీంకోర్టు నిర్ణయం చెంపపెట్టు. 2003లో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా... ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ తమిళనాడులో సక్రమంగా జరగదని, కర్ణాటకకు మార్చాలని డీఎంకే నేత కె.అన్బళగన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా... సుప్రీంకోర్టు దానికి సమ్మతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి కాబట్టి, ఆమె నిందితురాలిగా ఉన్న కేసు విచారణ ఆ రాష్ట్రంలో సక్రమంగా జరగదన్న ఉద్దేశంతో వేరే రాష్ట్రానికి మార్చారు. కానీ ఒక హత్య కేసు విచారణను, అది కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయి హత్య కేసు విచారణను... అధికారంలో ఉన్నవారి వల్ల సక్రమంగా జరగదేమోనన్న అనుమానంతో పక్క రాష్ట్రానికి మార్చడం ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు.

అప్పుడు రాజకీయం కోసం జగన్‌ చేసిందే... ఇప్పుడు నిజమైంది

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి దాడి ఘటన తర్వాత ఆయన ఇక్కడి పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి నిరాకరించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని, తెలంగాణ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇస్తానని ప్రకటించారు. అప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన రాష్ట్రం పరువు తీయాలని చూశారు. కానీ ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రం పరువు జాతీయస్థాయిలో మంటగలిసింది. ‘వివేకా హత్యకేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లో గాడి తప్పే ప్రమాదం ఉందని హతుడి భార్య, కుమార్తె వ్యక్తం చేసిన ఆందోళన హేతుబద్ధంగా కనిపిస్తోంది. కేసులోని వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నా విచారణ నిజాయతీగా, స్వతంత్రంగా జరిగే అవకాశం లేదని భావిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు చెప్పడం రాష్ట్రంలోని పరిస్థితులకు అద్దం పట్టింది. వివేకా హత్య కేసు విచారణ రాష్ట్రంలో సక్రమంగా జరిగే అవకాశం లేదని దేశ అత్యున్నత దర్యాప్తుసంస్థ సీబీఐ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడం, వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం రాష్ట్రంలో ఎంత అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయో తెలియజెబుతోంది. కేసు విచారణను దిల్లీకే మార్చేవారిమని, కానీ సాక్షుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పక్క రాష్ట్రానికి మార్చామని సుప్రీంకోర్టు చెప్పడం... ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల వ్యవహారశైలిని అభిశంసించడమేనన్న అభిప్రాయం వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

నాటి పేరు నేడేది?

రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన లేదని, ప్రభుత్వం, పోలీసులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారని చెప్పడానికి సుప్రీంకోర్టు నిర్ణయమే పెద్ద నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఎంత తీవ్రమైన అరాచక పరిస్థితులు ఉన్నాయో... సుప్రీంకోర్టు నిర్ణయంతో దేశం మొత్తానికి తెలిసినట్టయిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఒకప్పుడు మంచి పేరుండేది. నేర నియంత్రణ, పరిశోధనల్లో వారి నైపుణ్యానికి వివిధ వేదికలపై ప్రశంసలు దక్కేవి. కానీ గత మూడేళ్లలో ఆ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం చెప్పినదానికల్లా తలాడిస్తూ, న్యాయాన్ని, చట్టాల్నితుంగలో తొక్కుతూ... సామాన్యులపై సాగిస్తున్న దాష్టీకాల వల్ల పోలీసు యంత్రాంగం అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఇప్పుడు ఏకంగా జాతీయ స్థాయిలోనే వారి పరువు మంటగలిసింది. సామాన్యుల విషయం పక్కన పెడదాం. వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకే బెదిరింపులు ఎదురయ్యాయంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. ‘వివేకా హత్య కేసులో సాక్షులకు, దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు ఏపీలో బెదిరింపులు ఎదురవుతున్నందున అక్కడ నిష్పాక్షిక విచారణ, దర్యాప్తు జరుగుతుందని మాకు అనిపించట్లేదు’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏపీ పోలీసులు తలదించుకోవాల్సిన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. రాష్ట్ర పోలీసుల ఏకపక్ష, పక్షపాత ధోరణిని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించినట్టే ఆ వ్యాఖ్యల్ని పరిగణించాలి. రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇంత దారుణంగా విశ్వసనీయతకోల్పోవడం గతంలో ఎన్నడూ లేదు.


అంతటి సీబీఐనే సుప్రీంకోర్టుకు మొరపెట్టుకోవలసి వచ్చిందంటే..

సాధారణంగా సంక్లిష్టమైన, రాష్ట్ర పోలీసుల వల్ల సాధ్యం కాదనుకున్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తారు. అలాంటి సీబీఐనే రాష్ట్ర పోలీసులు మూడు చెరువుల నీళ్లు తాగించారంటే ఎంతటి ఘనులో అర్థమవుతోంది. వివేకా కేసులో నిందితుల నుంచి సాక్షులకు ప్రాణహాని ఉందని, వారి సంబంధీకులే దర్యాప్తు అధికారిని బెదిరించారని సుప్రీంకోర్టుకు సీబీఐ విన్నవించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, సాక్షులకు, దర్యాప్తు అధికారులకు కూడా రక్షణ కల్పించలేని స్థితికి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు యంత్రాంగం దిగజారిపోయిందంటే అంతకంటే పరువు తక్కువ విషయం ఇంకేం ఉంటుంది? ‘వివేకా హత్యకేసు నిందితులతో ఏపీ పోలీసులు కుమ్మక్కయ్యారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. సాక్షులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు’ అని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పటం, దానితో ఏకీభవించిన సుప్రీంకోర్టు కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని