ఆనందనిలయం బంగారు తాపడంపై చర్చ!

తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం జరగనుంది.

Updated : 30 Nov 2022 05:27 IST

తితిదే ధర్మకర్తల మండలి సమావేశం నేడు

తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్‌లో బుధవారం జరగనుంది. ప్రధానంగా శ్రీవారి ప్రధాన ఆలయంలోని ఆనందనిలయంపై ప్రస్తుతం ఉన్న రేకులు తొలగించి బంగారు తాపడం నిర్వహణపై  కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీని సాధ్యాసాధ్యాలపై తితిదే ఆగమ సలహా మండలి, జీయ్యంగార్లు, అర్చకులు ఇప్పటికే పలుమార్లు సమావేశమై చర్చించారు. స్వామివారికి నిర్వహించాల్సిన బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు, శ్రీవారి దర్శనాన్ని ఏవిధంగా భక్తులకు చేయించాలనే దానిపైన వారు చర్చించి నివేదికను తయారు చేసినట్లు సమాచారం. బోర్డు సభ్యులు ఆ నివేదికను పరిశీలించి బంగారు తాపడం పనులను ప్రారంభించేందుకు అంగీకరిస్తే వాటిని పూర్తిచేసేందుకు సుమారు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టనుందని అధికారులు తెలిపారు. గతంలో 1950 నుంచి 1958 వరకు ఆనందనిలయంపై బంగారు తాపడం పనులు నిర్వహించారు.

వైకుంఠ ఏకాదశి నిర్వహణపై చర్చ

వచ్చే సంవత్సరం జనవరిలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పదిరోజులపాటు ఏవిధంగా నిర్వహించాలి, భక్తులను ఎలా అనుమతించాలి, అవసరమైతే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా జారీ, ఇతర అంశాలపైన బోర్డులో చర్చించి తీర్మానం చేయనున్నారు.

* ప్రకృతి వ్యవసాయ రైతులకు చేయూతనందించడంలో భాగంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ ధరకన్నా కొంత శాతం పెంచి తితిదే కొనుగోలు చేయడంపైనా చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని