సంక్షిప్త వార్తలు (13)

రాష్ట్రంలోని 11.02 లక్షల మంది విద్యార్థులకు జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.694 కోట్లను మదనపల్లెలో బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated : 30 Nov 2022 05:47 IST

విద్యా దీవెన నాలుగో విడత నిధులు జమ నేడు

ఈనాడు,అమరావతి: రాష్ట్రంలోని 11.02 లక్షల మంది విద్యార్థులకు జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన రూ.694 కోట్లను మదనపల్లెలో బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2017 నుంచి ఉన్న బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద రూ.12,401 కోట్లు సాయం అందించినట్లు పేర్కొంది. పేదలు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, వైద్య విద్య తదితర కోర్సుల విద్యార్థులు తాము కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించింది.


ఏబీ వెంకటేశ్వరరావు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం కొట్టివేత

ఈనాడు, అమరావతి:  హైకోర్టు ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ కాలానికి రాష్ట్ర ప్రభుత్వం తనకు జీత భత్యాలు చెల్లించలేదంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. కోర్టు ఆదేశాలను సీఎస్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు తాము భావించడం లేదంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.


లిక్కర్‌ హోలోగ్రామ్స్‌ టెండర్లలో అవకతవకలపై విచారణకు కమిటీ

ఈనాడు, అమరావతి: మద్యం హోలోగ్రామ్స్‌ తయారీ కోసం యంత్ర పరికరాల సరఫరాకు జారీచేసిన టెండరు ప్రకటనపై వచ్చిన ఆరోపణల పరిశీలనకు రాష్ట్రప్రభుత్వం కమిటీని నియమించింది. ఏపీటీడీసీ ఎండీ ఛైర్మన్‌గా, సాధారణ పరిపాలనశాఖ అదనపు కార్యదర్శి, పర్యాటకం, సాంస్కృతిక శాఖ అదనపు కార్యదర్శి సభ్యులుగా ఈ కమిటీని నియమిస్తూ ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్‌ భార్గవ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.


‘ఆరోగ్యశ్రీ’ ప్యాకేజీలు పెంచాలి: ఐఎంఏ

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: పెరిగిన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించే ప్యాకేజీలనూ పెంచాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జి.రవికృష్ణ డిమాండ్‌ చేశారు. ఆధునిక చికిత్సల కోసం వినియోగించే పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరికరాల ధరలు పెరిగాయని వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి మంగళవారం విజయవాడకు వచ్చిన ఆయన ఐఎంఏ హాల్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సౌకర్యానికి ప్రస్తుతమున్న 50 పడకల నిబంధనను 20 పడకల వసతి కలిగిన ఆసుపత్రులకూ వర్తింపజేయాలని కోరారు.


‘సమగ్ర గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి’

ఈనాడు, అమరావతి: సమగ్ర గ్రామీణాభివృద్ధికి వీలుగా 2023-24కి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యదర్శి అలోక్‌ ప్రేమనగర్‌ రాష్ట్రానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒక రోజు పర్యటన కోసం వచ్చిన ఆయన మంగళవారం కానూరులోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థలో గ్రామీణాభివృద్ధి ప్రణాళికల తయారీపై రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే పథకాలను గ్రామీణాభివృద్ధి ప్రణాళిక తయారీలో చేర్చాలి. ప్రత్యేకంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం, విద్య, రహదారులు వంటి ముఖ్యమైన అంశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన మొత్తం 17 అంశాల్లో ముఖ్యమైన తొమ్మిదింటికి గ్రామీణాభివృద్ధి ప్రణాళికల తయారీలో అత్యధిక ప్రాధాన్యమివ్వాలి...’ అని ఆయన సూచించారు.


వైద్యులకు ప్రత్యేక బదిలీలు

ఈనాడు-అమరావతి: రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులకు ప్రత్యేక బదిలీలు జరగబోతున్నాయి. ఈ ఏడాది మార్చి/ఏప్రిల్‌ నెలల్లో సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌, సివిల్‌ సర్జన్‌ ఆర్‌.ఎం.ఒ. పోస్టులకు పదోన్నతులతో కూడిన బదిలీలు జరిగాయి. అప్పటి ఉత్తర్వులు అనుసరించి వీరికి (ద్వితీయ శ్రేణి గెజిటెడ్‌) స్థానిక జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆ తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. వీరి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ప్రత్యేక బదిలీలు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆసక్తి కలిగిన వైద్యుల నుంచి ఇప్పటివరకు వంద వరకు దరఖాస్తులు వచ్చాయి.


ఆయుష్‌ ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా జె.నివాస్‌

ఈనాడు-అమరావతి: ఆయుష్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ కమిషనర్‌గా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత కమిషనర్‌ కల్నల్‌ శ్రీరాములు మాతృ సంస్థకు వెళ్లారు.


హేచరీస్‌ స్థాపనకు 280 ఎకరాలు

ఈనాడు-అమరావతి: గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామ పరిధిలోని పారిశవారిపాలెంలో సముద్రతీరాన పండుగప్ప, పీతల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 280 ఎకరాలను కేటాయించింది. ఈ మేరకు భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.


అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలపై విద్యార్థులకు శిక్షణ

ఈనాడు-అమరావతి: అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, యూఎస్‌ కాన్సులేట్‌ నిర్ణయించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. యూఎస్‌ కాన్సులేట్‌ చీఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారి ఆధ్వర్యంలోని బృందం మంగళవారం డీజీపిని కలిసింది. పాస్‌పోర్టు, వీసా మోసాలు, మానవ అక్రమ రవాణా తదితర సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్లు డీజీపీ వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం పలువురు విద్యార్థులు నకిలీ ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తూ పట్టుబడ్డారని, ఈ విషయమై రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించామన్నారు. విశ్వవిద్యాలయాలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పంపే సమయంలో విద్యార్థులు కొంత రుసుముగా చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై అదనపు భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.


పీజీసెట్‌ కౌన్సెలింగ్‌ నేటి నుంచి

ఈనాడు, అమరావతి: ప్రొస్టుగ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 30 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ తెలిపారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్‌ ఈనెల 30 నుంచి డిసెంబరు 2, ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల పరిశీలన డిసెంబరు 1-3, వెబ్‌ఐచ్ఛికాల నమోదు డిసెంబరు 4-6, సీట్ల కేటాయింపు 8న పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.


పోర్టు ఏర్పాటుకు సర్వే!

ఈనాడు, అమరావతి: కృష్ణా జిల్లా మచిలీపట్టణం మండలంలో పోర్టు ఏర్పాటు చర్యల్లో భాగంగా 4గ్రామాల సరిహద్దు, బంగాళఖాతానికి మధ్యన ఉన్న సుమారు 1,700 ఎకరాల భూమిని సర్వే చేయబోతున్నారు. మంగినపూడిలో 788.07 ఎకరాలు, తవిసిపూడి- 326.90 ఎకరాలు, గోపువాణిపాలెం-477.12 ఎకరాలు, కర్రఅగ్రహారంలో 138.23 ఎకరాల్లో ఈ సర్వే జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌, భూమి రికార్డుల సంచాలకులు సిద్ధార్థ్‌జైన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.


రూ.386.81 కోట్ల ఉపాధి నిధుల విడుదల

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు హాజరయ్యే కూలీలకు వేతనాల చెల్లింపుల నిమిత్తం 2022-23 సంవత్సరానికి ఆరో విడతగా రాష్ట్రానికి రూ.386.81 కోట్లు విడుదలైనట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  


461 స్టాఫ్‌ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ!

రాష్ట్రంలో 461 స్టాఫ్‌ నర్సుల పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. పూర్తి వివరాలు వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సీఎఫ్‌డబ్ల్యూ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు