Viveka murder case: సీబీఐకే ముప్పుతిప్పలు
దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ అయిన సీబీఐకి.. మరెక్కడా లేని విధంగా అత్యంత చేదు అనుభవాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎదురయ్యాయి. సాధారణంగా నేరస్థులను సీబీఐ ముప్పుతిప్పలు పెడుతుంది.
దర్యాప్తు సంస్థకు అడ్డంకులు సృష్టించిన యంత్రాంగం
కేసులో అనుమానితుల హఠాన్మరణాలు
వివేకా హత్యకేసు దర్యాప్తునకు అడుగడుగునా ఆటంకాలు
ఈనాడు, అమరావతి: దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ అయిన సీబీఐకి.. మరెక్కడా లేని విధంగా అత్యంత చేదు అనుభవాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎదురయ్యాయి. సాధారణంగా నేరస్థులను సీబీఐ ముప్పుతిప్పలు పెడుతుంది. కానీ, సీబీఐనే ముప్పుతిప్పలు పెట్టిన ఘనత అధికార వైకాపాకు, అధికార యంత్రాంగానికే దక్కుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి సీబీఐ అధికారులకు వైకాపా నాయకులు, ఏపీ ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగనీయకుండా అడ్డంకులు కల్పించారు. సీబీఐని అష్టదిగ్బంధం చేశారు. ఈ కేసులో సీబీఐకి ఎవరైనా సాక్షులు వాంగ్మూలం ఇస్తే వారిని బెదిరించారు. సీబీఐ అధికారులు తమను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారంటూ వారితోనే చెప్పించారు. సీబీఐ దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు. బహుశా ఇంతటి దారుణమైన పరిస్థితి ఇంకెక్కడా ఉండదేమో!
దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులే..
వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరిన తరుణంలో దర్యాప్తు అధికారి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ రామ్‌సింగ్ తనను బెదిరిస్తున్నారని, దాడి చేశారని ఆరోపిస్తూ ఈ కేసులో అనుమానితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి హైకోర్టు ఆదేశాలతో ఆ ఎఫ్‌ఐఆర్‌పై స్టే వచ్చింది.
* తాడిపత్రి డీఎస్పీ చైతన్య తనను వేధిస్తున్నారంటూ ఈ కేసులో కీలక సాక్షి జగదీశ్వర్‌రెడ్డి సీబీఐకి ఫిర్యాదు చేశారు.
* ‘సీబీఐ బృందం వెంటనే కడప నుంచి వెళ్లిపోవాలి. లేకుంటే బాంబు వేసి పేల్చేస్తా. ఈ విషయాన్ని మీ అధికారులకు చెప్పండి’ అంటూ ముసుగు ధరించిన వ్యక్తి తనను బెదిరించాడని సీబీఐ అధికారుల వాహన డ్రైవర్ షేక్ వలీ బాషా కడప పోలీసులకు ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేశారు.
* గతంలో సీబీఐ అధికారుల బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లేటప్పుడు వారిని అడ్డుకునేందుకు అవినాష్‌రెడ్డి అనుచరులు యత్నించారు.
* శివశంకర్‌రెడ్డి జ్యుడిషియల్ రిమాండులో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అతన్ని కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
* వివేకా హత్య సమయంలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ అప్పటి పులివెందుల సీఐ జె.శంకరయ్య సస్పెండయ్యారు. తర్వాత ఈ కేసులో ఆయనకు తెలిసిన విషయాలతో 2021 సెప్టెంబరు 28న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు కోసం 2021 సెప్టెంబరు 30న న్యాయస్థానంలో సీబీఐ దరఖాస్తు చేసుకుంది. అయితే తన ఉద్యోగం విషయంలో కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలవాల్సి ఉందని, తాను బిజీగా ఉన్నానంటూ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు శంకరయ్య నిరాకరించారు. తర్వాత వారం రోజుల్లోనే.. అంటే 2021 అక్టోబరు 6న ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తేసింది.
అవినాష్ పేరు ప్రస్తావన తర్వాత మరింత తీవ్రతరం
వివేకానందరెడ్డిని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తన అనుచరుడైన శివశంకర్‌రెడ్డి ద్వారా చంపించినట్లు అనుమానాలున్నాయని ఛార్జిషీట్‌లో పేర్కొని, శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేశాక ఈ అడ్డంకులు, అవరోధాలు మరింత తీవ్రమయ్యాయి. దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోర్టు హాల్లోనే అడ్డుకున్నారు. శివశంకర్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేశావని ప్రశ్నించారు.
అవినాష్‌రెడ్డిపై అనుమానం
వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించటంలోనూ, ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయటం వెనుకా వై.ఎస్.అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలది ప్రధాన పాత్ర అని సీబీఐ దర్యాప్తులో తేల్చింది. శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసింది. నిందితుల్లో ఒకరైన దస్తగిరి అప్రూవర్‌గా మారటంతో కుట్రలో ఎవరెవరి పాత్ర ఏంటనేది బయటపెట్టింది. ‘కడప ఎంపీ టికెట్‌ను అవినాష్‌రెడ్డికి కాకుండా వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మల్లో ఎవరికో ఒకరికి ఇవ్వాలి’ అని వివేకా కోరారని.. దీంతో అవినాష్‌రెడ్డి తన అనుచరుడైన శివశంకర్‌రెడ్డి ద్వారా చంపించారన్న అనుమానాలు ఉన్నాయని సీబీఐ తన ఛార్జిషీట్‌లో పేర్కొంది.
ఆ వ్యాఖ్యలను బట్టే వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవొచ్చు
ఈ కేసులో సాక్షులు తమకు రక్షణ కల్పించాలని పదే పదే పోలీసులను వేడుకుంటున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. అయినా వారిలో భరోసా కల్పించేలా ఏపీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం కనిపించనందున, దాని వెనుక ఉన్న విస్తృత కుట్రకోణాన్ని వెలికితీసేందుకు కేసు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం తీర్పిచ్చింది. దీన్నిబట్టి సీబీఐ దర్యాప్తును అడ్డుకోవటం వెనుక ఎవరున్నారో అర్థమవుతుంది.
హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించి...
2019 మార్చిలో వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలు శుభ్రం చేసేశారు. రక్తపు గాయాలు కనపడనివ్వకుండా బ్యాండేజీలు చుట్టేశారు. ఆధారాలు ధ్వంసం చేశారు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం సీఐడీ విభాగాధిపతి అమిత్ గార్గ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ ప్రతిపక్ష నేత హోదాలో జగన్ అప్పట్లో ప్రకటించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో తొలుత దర్యాప్తు సాగింది. ఆయనపై ఒత్తిళ్లు అధికమవ్వటంతోనే ఆయన ఆ పోస్టు నుంచి రిలీవ్ అయ్యి వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తర్వాత కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. అసలైన సూత్రధారుల్ని పక్కకు తప్పించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వివేకా కుమార్తె ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. జగన్ ప్రభుత్వం మాత్రం సీబీఐ విచారణ అక్కర్లేదని అఫిడివిట్ దాఖలుచేసింది. అయినా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో వైకాపా నాయకులు, అధికారపార్టీ పెద్దల నుంచి సీబీఐకి ఆటంకాలు మొదలయ్యాయి. ఇన్ని జరిగినా.. జగన్ మాత్రం మౌనంగా ఉన్నారు.
అనుమానాస్పద మరణాలు.. నిగ్గుతేలని నిజాలు
* వివేకా హత్యకేసులో అనుమానితుడిగా ఉన్న కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కటికరెడ్డి శ్రీనివాసులురెడ్డి 2019 సెప్టెంబరు 3న చనిపోయారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏం జరిగిందో ఇప్పటికీ నిగ్గుతేలలేదు.
* ‘హత్యానేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి ఆఫర్ ఇచ్చారు’ అంటూ సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, తర్వాత మాట మార్చిన గంగాధర్‌రెడ్డి ఈ ఏడాది జూన్ 9న చనిపోయారు. దానిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
* ‘నా ప్రాణాలకు ముప్పు ఉంది. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నందుకు నన్ను అంతం చేయాలని ప్రయత్నిస్తున్నారు. నాకు ఏం జరిగినా వైకాపా నాయకులదే బాధ్యత. నా హత్యకు కొందరు కుట్ర చేస్తున్నారు’ అంటూ అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి, సీబీఐ అధికారులకు పదేపదే ఫిర్యాదులు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంపం.. 4,500కి చేరిన మృతులు!
-
Sports News
Ravi Shastri: అశ్విన్.. అతి ప్రణాళికలు వద్దు
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి