AP Govt: ఉపాధ్యాయులకు ఎన్నికల విధులొద్దు

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంధ విద్య (విద్యా హక్కు చట్టం) నియమాలు-2010కి సవరణ చేసింది.

Updated : 30 Nov 2022 09:03 IST

బోధనకే పరిమితం చేసేలా నియమాలను సవరించిన ప్రభుత్వం
మంత్రులకు ఆన్‌లైన్‌లో ఈ-ఫైల్‌ పంపించి సంతకాలు
అనుకూలంగా ఉండరనే తప్పించారని విమర్శలు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. వారిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ఏపీ ఉచిత, నిర్బంధ విద్య (విద్యా హక్కు చట్టం) నియమాలు-2010కి సవరణ చేసింది. విద్యా హక్కు చట్టం అమలుకు అనుగుణంగా 2011 మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-20ని సవరిస్తూ తాజాగా ఉత్తర్వు-185తోపాటు గెజిట్‌ ప్రకటనను విడుదల చేసింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను అప్పగించవద్దని, విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యేతర (నాన్‌ అకడమిక్‌) పనులకు ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత మరింత అవసరం ఉందనుకుంటేనే ఉపాధ్యాయులకు విధులను అప్పగించాలని వెల్లడించింది. విద్యా హక్కు చట్టం నియమాలు-2010ని సవరించేందుకు ప్రభుత్వం సోమవారం మంత్రులకు హడావుడిగా ఈ-ఫైల్‌ పంపించి సంతకాలు తీసుకుంది. కేంద్ర తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్‌ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదు. అయితే సెక్షన్‌-27లోని నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలను తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టేందుకు, ఎన్నికల విధులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పుడే ఎందుకీ సవరణ?

పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడకు ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతరత్రా సమస్యలపైనా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సవరణ చేసిందనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు సామాజిక మాధ్యమాల్లో నిరసన గళం వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వాలపై నెపం..

ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించి, బోధన పనులకే పరిమితం చేయాలనే నిబంధనను తీసుకొచ్చేందుకు వైకాపా ప్రభుత్వం గత ప్రభుత్వాలపై నెపం వేయడం గమనార్హం. రాష్ట్రంలో పాఠశాల విద్య, ఫౌండేషనల్‌ అక్షరాస్యత మెరుగుపై గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని, దీని కారణంగానే రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 67.35% ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. మౌలిక వసతులు కల్పించలేదని, సరిపడా ఉపాధ్యాయులను నియమించలేదని, మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించలేదని, సకాలంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇవ్వలేదని, పాఠశాల పర్యవేక్షణ, నియంత్రణ సరిగా చేయలేదని వెల్లడించింది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నందున ఉపాధ్యాయులు బోధన పనులకే పరిమితం కావాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అన్ని బోధనేతర పనుల నుంచీ తప్పించాలి: ఉపాధ్యాయ సంఘాలు

ఉపాధ్యాయులను బోధన పనులకే పరిమితం చేస్తూ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం నియమాలను సవరించడంపై ఉపాధ్యాయ సంఘాలు స్పందించాయి. ఎన్నికలు, జనగణన నుంచే కాకుండా పాఠశాలల్లో రోజువారీ నిర్వహిస్తున్న అన్ని బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండు చేశాయి.


సవరణలో ఏం చెప్పారు..

* సాధ్యమైనంత మేర ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాల్లోనే పాల్గొనాలి. విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

* విద్యార్థుల విద్యా స్థాయిలను మెరుగుపర్చడానికి ఉపాధ్యాయులు తమ సమయాన్ని కేంద్రీకరించాలి. ఇందుకోసమే పని చేయాలి.

* ఏదైన అనివార్య పరిస్థితుల్లో విద్యేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను వినియోగించాల్సి వస్తే.. మొదట ప్రభుత్వ శాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత మరింత సిబ్బంది అవసరం ఉందనుకున్నప్పుడే ఉపాధ్యాయులను వినియోగించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని