ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ నిబంధనలు అమల్లోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ నిబంధనలను అమల్లోకి తీసుకువస్తూ అటవీ పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Published : 30 Nov 2022 05:38 IST

ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ వాడకం నిషేధం
ఉల్లంఘిస్తే జరిమానా, ప్రాసిక్యూషన్‌కు అవకాశం

ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ నిబంధనలను అమల్లోకి తీసుకువస్తూ అటవీ పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిబంధనలు ఎవరు ఎలా అమలు చేయాల్సి ఉంటుందో అందులో స్పష్టంగా వెల్లడించారు. ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ మళ్లీ వినియోగంలోకి రాకుండా నిషిద్ధ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.  రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే అధికారులు ఈ నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందో అందులో పేర్కొంది. కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారుల నుంచి జోనల్‌ అధికారుల వరకు ఇందుకు బాధ్యులను చేసింది. మున్సిపల్‌ అధికారులు, పట్టణ స్థానిక సంస్థల్లో ఆరోగ్యాధికారులు, వార్డు పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు కార్యదర్శులు కొనుగోలు, అమ్మకాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేలా చూడాల్సి ఉంటుంది. జిల్లా పంచాయతీ అధికారులు, డీఎల్‌పీవోలు, పంచాయతీరాజ్‌ ఈవోలు, పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. తయారీదారులకు సంబంధించి జరిమానాలు, చర్యలు- స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూషన్‌ చేసే వారి వద్ద తప్పులకు జరిమానాలు ఇందులో నిర్దేశించారు.

* తయారీదారులు ఈ నిబంధనలు పాటించడంలో ఒకసారి తప్పు చేస్తే రూ.50 వేల వరకు, రెండోసారి తప్పు చేస్తే రూ.లక్ష వరకు జరిమానాతో పాటు ఆ ప్లాంటు సీజ్‌ చేస్తారు. వారు ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి ఉన్న అనుమతులు రద్దు చేస్తారు.

* స్టాకిస్టులు, డిస్ట్రిబ్యూటరీ పాయింట్ల వద్ద ఒకసారి నిబంధనల ఉల్లంఘన జరిగితే రూ.25 వేల వరకు జరిమానా, ఆ నిల్వలు సీజ్‌ చేయవచ్చు. రెండోసారి తప్పు చేస్తే రూ.50 వేల వరకు జరిమానాతో పాటు పర్యావరణ చట్టం కింద ప్రాసిక్యూషన్‌ చేస్తారు..

* వీధి వ్యాపారులకు రూ.2,500 నుంచి రూ.5,000 వరకు జరిమానా ...వారి అమ్మకాలను అడ్డుకునే స్థాయి చర్యలకు అవకాశం.

* షాపులు, సంస్థలు, వ్యాపార సంస్థల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు జరిమానా, వ్యాపార లైసెన్సు రద్దు చేసే వరకు చర్యలు తీసుకోవచ్చు. మొదటిసారి తప్పునకు ఒక తరహా, అదే తప్పు రెండోసారి చేస్తే మరో తరహా చర్యలకు అవకాశాలు.

* ప్లాస్టిక్‌ రవాణా విషయంలో తాజా నిబంధనలు ఉల్లంఘిస్తే రవాణా అధికారులు చర్యలు తీసుకుంటారు. జరిమానాలు, వాహనాల స్వాధీనం, ప్రాసిక్యూషన్‌ చర్యలకు ఇందులో వీలు కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని