నిధుల్లేక నిలిచిన ‘నైపుణ్యం’!

నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, కళాశాలలను ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. నిధుల కొరతతో భవన నిర్మాణాలను అటకెక్కించింది.

Updated : 30 Nov 2022 06:17 IST

అటకెక్కిన నైపుణ్య కళాశాలల భవన నిర్మాణ ప్రతిపాదనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కేంద్రాల్లో సర్దుబాటుకు నిర్ణయం

ఈనాడు, అమరావతి: నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, కళాశాలలను ఏర్పాటు చేస్తామంటూ ఊదరగొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. నిధుల కొరతతో భవన నిర్మాణాలను అటకెక్కించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, దాతలు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద నిధులు సేకరించాలని ప్రభుత్వం మొదట భావించినా ఇది కార్యరూపం దాల్చకపోవడం, సొంత నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం నైపుణ్య కళాశాలల ఏర్పాటు విధానాన్నే మార్చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఖాళీ భవనాల్లోనే కళాశాలలను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 3 కళాశాలలను అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరుల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థల భవనాల్లో ప్రారంభించగా.. మరో కళాశాలను నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసింది. డిసెంబరు నెల పూర్తయ్యేలోగా మరో 10 కళాశాలలను యువజన శిక్షణ కేంద్రాలు, టెక్నికల్‌ శిక్షణాభివృద్ధి కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది.

* ప్రభుత్వం వచ్చిన కొత్తలో లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25, పులివెందుల, 4 ట్రిపుల్‌ఐటీల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 30 నైపుణ్య కళాశాలలకు భవనాలు నిర్మించి, అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. ఒక్కో కళాశాల ఏర్పాటుకు మొదట్లో రూ.40 కోట్ల వ్యయమవుతుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అంచనా వేసింది. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని రూ.20 కోట్లకు తగ్గించింది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల భవనాల నిర్మాణానికి ఆకృతులను రూపొందించి, నిర్మాణాలకు మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా గుత్తేదార్ల నుంచి స్పందన లభించలేదు.

నిధుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం..

రాష్ట్రంలో 30 కళాశాలల్లో రెండింటిని డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్మిస్తుందని మొదట ప్రభుత్వం ప్రకటించింది. వీటి పనులు ప్రారంభం కాలేదు. పులివెందులలో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఏడీఏ) నిర్మాణ పనులను చేపట్టింది. ట్రిపుల్‌ఐటీల్లో నిర్మించాల్సిన వాటికి నిధులు ఎవరు సమకూర్చాలనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఈ 4 కళాశాలల ప్రతిపాదనలు మూలనపడ్డాయి. మిగతా 23 కళాశాలలను ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా నిధుల కొరత ఏర్పడింది.
* జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ సాఫ్ట్‌ లోన్‌, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వశాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌, జాతీయ అప్రెంటిస్‌షిప్‌ ప్రచార పథకాల కింద కేంద్రం నుంచి నిధులను తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ప్రయత్నించారు. వాటి నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఆ తర్వాత పరిశ్రమలశాఖ సమన్వయంతో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌), దాతల నుంచి నిధులు సేకరించాలనే ఆలోచన చేశారు. ఇదీ కార్యరూపం దాల్చలేదు.

* నైపుణ్యాభివృద్ధి వర్సిటీ, కళాశాలలను ఏర్పాటు చేసి, మొదటి ఏడాది నిర్వహణకు అవసరమయ్యే నిధులతో కలిపి మొత్తం రూ.1,650 కోట్లు కావాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

భవనాల ఆకృతుల రూపకల్పన..

కళాశాలలు, విశ్వవిద్యాలయాల భవన నిర్మాణాలకు ఆకృతులను నైపుణ్యాభివృద్ధి సంస్థ రూపొందించింది. వీటికి రూ.లక్షల్లో వ్యయం చేశారు. ఆ నమూనాల్లో భవనాలు నిర్మించేందుకు టెండర్లు పిలవగా.. గుత్తేదార్లు నుంచి స్పందన లభించలేదు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకం లేకపోవడంతో గుత్తేదార్లు ముందుకు రాలేదు. నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున చెల్లిస్తామని హామీ ఇచ్చినా గుత్తేదార్లకు నమ్మకం కలగలేదు. దీంతో కొత్త భవనాలు నిర్మించలేక ఉన్న వాటిల్లోనే ఎక్కడో చోట సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు