ఏపీహెచ్‌సీఏఏ కార్యవర్గం చట్టవిరుద్ధంగా కొనసాగుతోంది

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసినా ఇప్పటికీ చట్టవిరుద్ధంగా, అనధికారికంగా కొనసాగుతోందని హైకోర్టు తేల్చి చెప్పింది.

Published : 30 Nov 2022 05:38 IST

వివరాలు సమర్పించాలని ఏపీ బార్‌ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం (ఏపీహెచ్‌సీఏఏ) కార్యవర్గ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగిసినా ఇప్పటికీ చట్టవిరుద్ధంగా, అనధికారికంగా కొనసాగుతోందని హైకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు ఏపీహెచ్‌సీఏఏ కార్యకలాపాలు,  ఎన్నికల నిర్వహణ విషయంలో సుమోటోగా లేదా పిటిషనర్‌ ఇచ్చిన వినతి ఆధారంగా  బైలాస్‌ ప్రకారం చర్యలు తీసుకోవడంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ (న్యాయవాదుల మండలి) విఫలమైందని పేర్కొంది. న్యాయవాదుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పిటిషనర్‌ ఇచ్చిన వినతి ఆధారంగా బైలాస్‌ను అనుసరించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలని బార్‌ కౌన్సిల్‌ను ఆదేశించింది. విచారణను డిసెంబరు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం కాల పరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఏపీ బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేవంటూ న్యాయవాది ఎన్‌.విజయ భాస్కర్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ‘ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులే.. వారి హక్కుల కోసం హైకోర్టులో వ్యాజ్యం వేయడం దురదృష్టం కాదా’ అని విచారణ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కాలపరిమితి ముగిసినా ఏ విధంగా కొనసాగుతారని ప్రశ్నించారు. ఎన్నికలు నిర్వహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని, సకాలంలో ఎన్నికలు నిర్వహించి మళ్లీ గెలిస్తే ఎవరు కాదంటారని ప్రశ్నించారు.

పిటిషనర్‌ ఇచ్చిన వినతిపై ఏమి చర్యలు తీసుకున్నారని ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫు న్యాయవాది ఎస్‌వీఆర్‌ సుబ్రమణ్యంను ప్రశ్నించారు. . న్యాయవాది బదులిస్తూ.. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు విచారణను డిసెంబరు 1కి వాయిదా వేయాలని కోరారు. అందుకు న్యాయమూర్తి అంగీకరించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు