జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆస్తుల జప్తు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సన్నిహితుడైన కాంట్రాక్టర్‌ సి.గోపాల్‌రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.

Published : 01 Dec 2022 05:14 IST

ఈనాడు, అమరావతి: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన సన్నిహితుడైన కాంట్రాక్టర్‌ సి.గోపాల్‌రెడ్డితోపాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన రూ.22.10 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. రూ.6.31 కోట్ల విలువైన చరాస్తులు, రూ.15.79 కోట్ల విలువైన స్థిరాస్తులు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. దివాకర్‌రెడ్డి లైన్స్‌, జటధార ఇండస్ట్రీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కో కంపెనీల పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. బీఎస్‌4 ప్రమాణాలు పాటించని వాహనాలను 2017 ఏప్రిల్‌ 1 తర్వాత విక్రయించడానికి వీల్లేదని, వాటికి రిజిస్ట్రేషన్‌ చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. జటధార ప్రైవేటు లిమిటెడ్‌ (జేఐపీఎల్‌), సి.గోపాల్‌రెడ్డి అండ్‌ కో సంస్థలు అశోక్‌ లేలాండ్‌ కంపెనీ నుంచి బీఎస్‌-3 వాహనాలను తుక్కు (స్క్రాప్‌) కింద కొనుగోలు చేసి ఆ వాహనాలకు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటివరకూ రూ.38.36 కోట్ల అవకతవకలను గుర్తించామని, దర్యాప్తులో భాగంగా నకిలీ ఇన్‌వాయిస్‌లను స్వాధీనం చేసుకున్నామని ఈడీ వివరించింది. ఈ కుంభకోణంలో అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని