కిరణ్‌ రాయల్‌ ఫోన్‌లో సమాచారం వెలికి తీయొద్దు

జనసేన నేత కిరణ్‌ రాయల్‌కు చెందిన ఫోన్‌లోని సమాచారాన్ని బయటకు తీయవద్దని ఫోరెన్సిక్‌ ల్యాబోరెటరీ, తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Published : 01 Dec 2022 04:29 IST

జనసేన నేత కిరణ్‌ రాయల్‌కు చెందిన ఫోన్‌లోని సమాచారాన్ని బయటకు తీయవద్దని ఫోరెన్సిక్‌ ల్యాబోరెటరీ, తిరుపతి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. పర్యాటకశాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నగరికి చెందిన సాయి సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కిరణ్‌రాయల్‌తోపాటు మరికొందరిపై నగరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకేసును కొట్టివేయాలని ఆయన హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

నా ఫోన్లు దొంగిలించారు

విజయవాడ వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: కోర్టు పర్యవేక్షణలో ఉన్న తన రెండు సెల్‌ఫోన్లను నగరి పోలీసులు దొంగిలించారని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. నవంబరు 11న మంత్రి ఆర్‌కే రోజా పై తాను ఏవో వ్యాఖ్యలు చేశానంటూ అరెస్టు చేశారని, తన రెండు సెల్‌ఫోన్లనూ బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. నగరి పోలీసుల తీరుపై హైకోర్టులో పిటీషన్‌ వేశానని, తనకు న్యాయం జరిగిందని వివరించారు. 

అనుమతి పొందారు.. సంతకం మరిచారు: నగరి డీఎస్పీ

నగరి, న్యూస్‌టుడే: కిరణ్‌ రాయల్‌ అరెస్టు కేసులో సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు (ఎఫ్‌ఎస్‌ఎల్‌) పంపడానికి కోర్టు అనుమతితో తీసుకున్నామని, కోర్టు కానిస్టేబుల్‌ ప్రాపర్టీ రిజిస్టర్‌లో సంతకం పెట్టడం మరిచారని డీఎస్పీ రవికుమార్‌ పేర్కొన్నారు. నగరిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోర్టు అనుమతి పత్రం చేతికొచ్చాకే సెల్‌ఫోన్లు తీసుకున్నారని, అలా తీసుకున్నట్లు సంతకం చేయకపోవడం పొరపాటేనని, ఇందులో పోలీసుల ప్రత్యేక ఉద్దేశం ఏమీలేదని తెలిపారు. కిరణ్‌ రాయల్‌ను నవంబరు 11న అరెస్టు చేసి, ఆ కేసులో రెండు ఐఫోన్ల నుంచి సాక్ష్యాధారాలను వెలికితీయడానికి పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని