Andhra News: ఏ పనీ కావడం లేదు.. అభివృద్ధి లేదు: వైకాపా ప్రజాప్రతినిధుల ఆగ్రహం

అధికారంలోకి వచ్చినా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని, ఏ అభివృద్ధి పనులూ జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 01 Dec 2022 10:21 IST

అధికారంలోకి వచ్చినా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని, ఏ అభివృద్ధి పనులూ జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రజలపై పన్నుల భారం వేస్తున్నా... ఆ మేరకు ప్రగతి చూపించలేకపోతున్నాం. అధికార పార్టీ సభ్యులుగా ఉన్నా ఏం ప్రయోజనం’ అంటూ బుధవారం వారు ధ్వజమెత్తారు. పార్వతీపురం జిల్లా సాలూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పురపాలికల్లో ఈ మేరకు ప్రజాప్రతినిధులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. హిందూపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో అధికారుల తీరుకు నిరసనగా ఏకంగా ఒక వైకాపా కౌన్సిలర్‌ రాజీనామా చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్తు సర్వసభ్య సాధారణ సమావేశం నుంచి అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం.


టీ, బిస్కెట్ల సమావేశాలేనా?

సాలూరు, న్యూస్‌టుడే: ‘ప్రతి నెలా సమావేశానికి వచ్చి టీ, బిస్కెట్లు తీసుకుని వెళ్లడం తప్ప సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు...’ అని ఛైర్‌పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ (వైకాపా) వ్యాఖ్యానించారు. పార్వతీపురం జిల్లా సాలూరు పురపాలికలో బుధవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బిల్లులు ఇవ్వడం లేదని, ఇలాగైతే కొత్త పనులకు గుత్తేదారులు ఎందుకు టెండర్లు వేస్తారని ప్రశ్నించారు. 


ఎజెండా బారెడు .. అమలు బెత్తెడు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ‘కౌన్సిల్‌ సమావేశాల్లో ఎజెండా బారెడున్నా... అభివృద్ధి పనులు బెత్తెడే’ అని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పురపాలక ఛైర్మన్‌ రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆళ్లగడ్డ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా వైస్‌ ఛైర్మన్‌గా, ఛైర్మన్‌గా ఉన్నా ప్రజలకు చేసిన అభివృద్ధి లేదని తెలిపారు. పన్నుల భారం ప్రజలపై పడుతున్నా... అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.


రెండేళ్లుగా ఒక్క రూపాయీ నిధులివ్వలేదు

కర్లపాలెం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిషత్తులో బుధవారం ఎంపీపీ యారం వనజ అధ్యక్షత వహించిన సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతుండగానే అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అధికారులకు ప్రజాప్రతినిధులంటే లెక్కలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండల ప్రజా పరిషత్తులో ఎంత మొత్తం నిధులున్నాయో అధికారులు తెలపడం లేదన్నారు. ఎంపీటీసీ సభ్యులుగా ఎన్నికై రెండో ఏడు గడుస్తున్నా ఒక్క రూపాయీ మంజూరు చేయలేదని, తాము గెలిచి ఏం ఉపయోగమని అధికారులను వారు నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని