ఆనంద నిలయానికి మళ్లీ బంగారు తాపడం

శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం వేసేందుకు నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు.

Updated : 01 Dec 2022 06:17 IST

పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
తితిదే ధర్మకర్తల మండలిలో కీలక నిర్ణయాలు

ఈనాడు, తిరుపతి: శ్రీవారి ఆనంద నిలయానికి బంగారు తాపడం వేసేందుకు నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆగమ పండితులు, అర్చకుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 1957-58లో ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయించారని, నాడు అనుసరించిన విధానాలనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న బాలాలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో తితిదే ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. ‘ఆనంద నిలయానికి బంగారు తాపడం కోసం విరాళాలిస్తామని పలువురు దాతలు ముందుకొచ్చారు. ఒక్కరినుంచి తీసుకుని తాపడం చేయించడం భావ్యం కాదని నిర్ణయించాం. తాము సమర్పించిన కానుకలు స్వామికి వినియోగించారన్న సంతృప్తి భక్తులకు కలగాలన్న ఉద్దేశంతో.. వారు కానుకలుగా ఇచ్చిన బంగారం నుంచే తాపడం చేయించనున్నాం. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం. తాపడం పనులు జరిగే సమయంలోనూ స్వామివారికి కైంకర్యాలు, భక్తులకు దర్శనం యథావిధిగా కొనసాగుతాయి. జనవరి 2 నుంచి పది రోజులపాటు శ్రీవారి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నాం.రోజూ ఆన్‌లైన్‌ ద్వారా 25వేలు, ఆఫ్‌లైన్‌లో 50 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన (ఎస్‌ఈడీ) టోకెన్లు జారీచేస్తాం. దీంతోపాటు వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి ట్రస్టు దాతలకు కలిపి రోజుకు 80వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నాం. తిరుపతిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేసి జనవరి 1 నుంచి 10 రోజులపాటు ఆఫ్‌లైన్‌ టోకెన్లు ఇస్తాం. టోకెన్లు లేని భక్తులు తిరుమల వచ్చినా వైకుంఠ ద్వార దర్శనం కల్పించలేం. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం’ అని వెల్లడించారు. ‘గురువారం నుంచి నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా.. బ్రేక్‌ దర్శనాన్ని ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య ప్రారంభించనున్నాం. 

* హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి ట్రస్టు ద్వారా నిర్మిస్తున్న ఆలయాల్లో మిగిలిన 1,200 ఆలయాలను దేవాదాయశాఖ, జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించనున్నాం.

* అలిపిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక నగరం నిర్మాణానికి సంబంధించిన నక్షాలకు ఆమోదముద్ర వేశాం. తొలి దశ పనులకు అంచనాలు రూపొందించాల్సిందిగా ఆదేశించాం.

* జమ్ముకశ్మీర్‌లో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ ప్రాంగణంచుట్టూ నిర్మాణాలతోపాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.7 కోట్ల మంజూరుకు అనుమతిచ్చాం.

* తితిదేలో శాశ్వత, ఒప్పంద, పొరుగుసేవలు, కార్పొరేషన్‌లో ఉద్యోగులకు జీతాల పెంపుపై ఈవో ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే సమావేశానికి ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా సూచించాం.

* లడ్డూ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న కేవీఎం సంస్థ సిబ్బందిలో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, పలుమార్లు సంస్థకు నోటీసులు ఇచ్చాం. నిఘా పెట్టి 3 నెలల్లో ఏడుగురిని అరెస్టు చేశాం. లడ్డూ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు శ్రీవారి సేవకులను నియమించి కట్టుదిట్టం చేశాం’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని