మూడు జిల్లాల్లో ముప్పుతిప్పలు!

మదనపల్లెలోని టిప్పు సుల్తాన్‌ మైదానంలో జరిగిన సీఎం జగన్‌ సభకు దాదాపు వేయి బస్సులను వినియోగించడంతో అన్నమయ్య, వైయస్‌ఆర్‌, చిత్తూరు జిల్లాల్లోని ప్రయాణికులు, శ్రీవారి భక్తులు బుధవారం ఇబ్బందులు పడ్డారు.

Updated : 01 Dec 2022 07:06 IST

1,000 ఆర్టీసీ బస్సుల వినియోగం
సీఎం సభతో అల్లాడిన ప్రయాణికులు 

ఈనాడు డిజిటల్‌, కడప- మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మదనపల్లెలోని టిప్పు సుల్తాన్‌ మైదానంలో జరిగిన సీఎం జగన్‌ సభకు దాదాపు వేయి బస్సులను వినియోగించడంతో అన్నమయ్య, వైయస్‌ఆర్‌, చిత్తూరు జిల్లాల్లోని ప్రయాణికులు, శ్రీవారి భక్తులు బుధవారం ఇబ్బందులు పడ్డారు. చివరకు తిరుమల ఘాట్‌ రోడ్డులో నడిచే బస్సులనూ మళ్లించారు. అన్నిచోట్ల బస్టాండ్లన్నీ బోసిపోగా రహదారులపై బస్సుల కోసం వందల మంది ప్రయాణికులు వేచి చూశారు. సభకు ప్రజలను తీసుకొచ్చిన బస్సులను మీడియా కంట పడకుండా వేర్వేరు ప్రాంతాల్లో దూరంగా ఉంచారు. సభ ముగిసిన అనంతరం బస్సుల వద్దకు జనం చేరుకోవడానికి, వాటిని గుర్తించడానికి నానాపాట్లు పడ్డారు. ప్రధానంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి విద్యార్థులను, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, రాయచోటి నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు. వేదిక ముందు వేసిన టెంట్‌ కింద కుర్చీలన్నీ నిండిపోగా... బయట నిల్చున్నారు. దాంతో ఎండను, తీవ్ర ఉక్కపోతను భరించలేక సీఎం ప్రసంగం పూర్తికాకముందే జనం వెనుదిరుగుతూ కనిపించారు. మరోవైపు మదనపల్లె పట్టణాన్ని పోలీసులు దిగ్బంధించారు. దాదాపు వీధులన్నీ మూసివేసి... అక్కడక్కడ తనిఖీలు చేసి అనుమతించారు. దుకాణాలన్నీ మధ్యాహ్నం వరకు మూసేయాల్సి వచ్చింది. పట్టణ ప్రజలు చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. సభలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కరే మాట్లాడారు.

తోపులాటలో పలువురికి గాయాలు

సభా ప్రాంగణంలో జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు. కోళ్లబైలు పంచాయతీ కాట్లటపల్లెకు చెందిన శాంతమ్మకు (60) కాలు విరగడంతో పోలీసులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లెకు చెందిన సుమలత (37), వెంకట రమణ (40), సిరాజున్నీసా (50), రామిరెడ్డి లేవుట్‌కు చెందిన రోశయ్య (45) గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం రెడ్డికోటకు చెందిన రెడ్డప్ప(49) బారికేడ్లు ఎక్కుతుండగా పోలీసులు గట్టిగా వెనక్కి లాగడంతో బారికేడ్లపై ముఖం పడి ముక్కులో నుంచి రక్తం కారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని