చిరుద్యోగులను తగ్గించుకుందాం!

ఒక వైపు పదవీ విరమణ చేస్తున్న ఉన్నత స్థాయి అధికారులకు రూ.లక్షల్లో వేతనాలు, సౌకర్యాలు కల్పిస్తూ... వారి కోసం కొత్త కొత్త పోస్టులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధశాఖల్లో చిరుద్యోగులను, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది.

Updated : 01 Dec 2022 08:57 IST

కొత్త బడ్జెట్‌ నేపథ్యంలో ఆర్థికశాఖ ఆంక్షలు

ఈనాడు, అమరావతి: ఒక వైపు పదవీ విరమణ చేస్తున్న ఉన్నత స్థాయి అధికారులకు రూ.లక్షల్లో వేతనాలు, సౌకర్యాలు కల్పిస్తూ... వారి కోసం కొత్త కొత్త పోస్టులు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వివిధశాఖల్లో చిరుద్యోగులను, పొరుగు సేవల సిబ్బందిని కొనసాగించేందుకు మాత్రం విముఖంగా ఉంది. వీలైనంత వరకు తగ్గించుకోవాలంటూ ప్రభుత్వశాఖలకు మార్గదర్శకాలు ఇస్తోంది. ఈ మేరకు తాజాగా ఆర్థికశాఖ సర్క్యులర్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన ప్రతి విశ్రాంత ఐఏఎస్‌కు ఇటీవల కాలంలో ఏదో ఒక పోస్టును ప్రత్యామ్నాయంగా చూపింది. రాజకీయ అవసరాల కోసం లెక్కకు మిక్కిలి సలహాదారుల పోస్టులను కేటాయిస్తూ కేబినెట్‌ హోదాలు కట్టబెడుతోంది. లక్షల్లో జీతాలు చెల్లిస్తోంది. మరోవైపు కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసే క్రమంలో ఖర్చు తగ్గించుకోవాలంటూ అన్ని ప్రభుత్వశాఖలకు సుద్దులు చెప్పడం గమనార్హం. కొత్తగా సహాయ సిబ్బంది తమకు కావాలంటూ ఇక ఏ ప్రభుత్వశాఖ ప్రతిపాదనలు పంపవద్దని సూచించింది. 2023-24 బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయం దగ్గర పడటంతో ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. అనేక ఆంక్షలు విధించింది. ఆ ప్రతిపాదనలు ఎలా ఉండాలి.. ఖర్చు ఎలా తగ్గించుకోవాలి.. ఎక్కడెక్కడ ఎలా కోత పెట్టాలో పేర్కొంటూ ఉత్తర్వులిచ్చింది. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఈ మార్గదర్శకాలిచ్చారు. పొరుగు సేవల సిబ్బందికి, ఒప్పంద ఉద్యోగులకు జీతాలు చెల్లించే క్రమంలో ‘300-అదర్‌ కాంట్రాక్ట్యువల్‌ సర్వీసెస్‌’ అనే హెడ్‌ కింద ప్రతిపాదనలను పంపుతున్నారు. వీరి జీతాలకు బడ్జెట్‌లో ప్రొవిజన్‌ చూపే సమయంలో సంబంధిత విభాగాధిపతి వారిని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను అందులో ప్రస్తావించాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.

అత్యవసర సేవలకే కొత్త వాహనాల కొనుగోలు

ప్రభుత్వంలో ఇక కొత్త వాహనాల కొనుగోళ్లకు నిషిద్ధమని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం కొత్త బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలు ఉండకూడదు. అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ శాఖలకే వాహనాల కొనుగోలుకు అవకాశం ఉంది.

* అనేక ప్రభుత్వశాఖలు బడ్జెట్‌ అంచనాలను సరిగా పాటించడం లేదు. ప్రతిపాదనలకు, అసలు ఖర్చులకు మధ్య పొంతన ఉండటం లేదు. నిజానికి ఎంత నిధి అవసరమో అంచనా వేయలేకపోతున్నాయని ఆడిట్‌ అభ్యంతరాలూ వ్యక్తమవుతున్నందున వాస్తవాలకు దగ్గరగా ఉండే ప్రతిపాదనలే సమర్పించాలి.

* ప్రైవేటు వాహనాలను అద్దెకు తీసుకునేందుకు స్పష్టమైన ఉత్తర్వులుంటేనే వాటి చెల్లింపులకు ప్రతిపాదనలివ్వాలి. ప్రభుత్వం నుంచి నిర్ధిష్టంగా ఇందుకు మంజూరు లేకపోతే వాటికి చెల్లింపులు చేయడానికి వీల్లేదు.

* ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను పరిమితం చేసుకుందాం. ఒకే తరహా పథకాలు ఒకటికి మించి ఉంటే వాటిని సమ్మిళితం చేద్దాం. ఇప్పటికే కేంద్రం అమలు చేస్తున్న తరహా పథకాలు రాష్ట్రంలో కొత్తగా ఏవీ ప్రారంభించకుండా చూడాలి.

* ఆయా ప్రభుత్వశాఖలు పంపిన బడ్జెట్‌ ప్రతిపాదనలను సచివాలయంలోని పాలనా విభాగాధిపతులు పరిశీలించి వారి అభిప్రాయాలను జత చేయాల్సి ఉంటుంది. డిసెంబరు 12 నాటికి కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలను సమర్పించాలి.


కొత్తగా కన్సల్టెంట్లను నియమించుకోవద్దు. విశ్రాంత ఉద్యోగులను మళ్లీ ఉద్యోగంలో చేర్చుకునే విషయాన్ని బాగా తగ్గించుకోవాలి. పొరుగు సేవల సిబ్బందిని వీలైనంతగా తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఎంతవరకు అవసరమో క్షుణ్ణంగా పరిశీలించాలి’

ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని