సీఎఫ్‌ఎంఎస్‌కు ఇక మంగళం?

రాష్ట్రంలో 5 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ సీఎఫ్‌ఎంఎస్‌కు ఇక ప్రభుత్వం మంగళం పాడనుందా? తాజా పరిణామాలను గమనిస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 01 Dec 2022 08:06 IST

హెర్బ్‌లోనే సమర్పించాలని ఆర్థికశాఖ ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 5 సంవత్సరాలకుపైగా అమల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ సీఎఫ్‌ఎంఎస్‌కు ఇక ప్రభుత్వం మంగళం పాడనుందా? తాజా పరిణామాలను గమనిస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కా పారదర్శకంగా పేరు పొందిన సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలను మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికశాఖ తాజా ఆదేశాలు బలం చేకూరుస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికశాఖ ఆహ్వానించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖలూ తమ బడ్జెట్‌ ప్రతిపాదనలను హెచ్‌ఈఆర్‌బీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ లోనే సమర్పించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వశాఖల నియంత్రణ అధికారులకు ఈ సైట్‌కు సంబంధించిన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డు అందిస్తామని అందులో పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థను (సీఎఫ్‌ఎంఎస్‌) ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.వందల కోట్లు ఖర్చు చేశారు. శాప్‌ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపు 5 సంవత్సరాలుగా బడ్జెట్‌ ప్రతిపాదనలు, రూపకల్పన, ఆమోదం, బిల్లుల సమర్పణ, చెల్లింపులు అన్నీ ఈ వ్యవస్థలోనే సాగుతున్నాయి. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి హెర్బ్‌ ద్వారా ఆర్థిక వ్యవస్థను నిర్వహించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలు, ఆమోదం తదితరాలన్నీ ఇదే కొత్త విధానంలో ముందుకు సాగితే ఆ తరవాత బిల్లుల ప్రతిపాదనలు, సమర్పణ, చెల్లింపులు అదే ప్రక్రియలో సాగవలసి ఉంటుంది. హెర్బ్‌ స్థానిక సాంకేతిక నిపుణుల సాయంతోనే రూపొందించారని సమాచారం. సీఎఫ్‌ఎంఎస్‌లో ఉన్న అనేక వెసులుబాట్లను సరిగ్గా వినియోగించుకుంటే అదొక మంచి వ్యవస్థ అని ఆర్థికశాఖలోనే అనేక మంది చెబుతుంటారు. బిల్లుల చెల్లింపులకు సంబంధించి పారదర్శకంగా ఉండే వ్యవస్థగా పేర్కొంటున్నారు. తొలుత వచ్చిన బిల్లు తొలుత చెల్లించేలా సీఎఫ్‌ఎంఎస్‌లో ఏర్పాటు ఉంది. ఒక వేళ మార్పులూ చేర్పులు ఎక్కడ చేసినా అందులో ఎవరు ఏం చేశారో స్పష్టంగా నమోదై ఉంటుంది. తాజా వ్యవస్థలో ఆ వెసులుబాటు లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయనే విమర్శ ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని