చంద్రబాబు, లోకేశ్‌ల భద్రతలో లోపాలు

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సంబంధించి భద్రతలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 01 Dec 2022 05:12 IST

 ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సంబంధించి భద్రతలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌లపై దాడి చేయాలనే ఉద్దేశంతో కొందరు వైకాపా నాయకులు సంఘ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీపీకి బుధవారం ఆయన లేఖ రాశారు. ‘‘2019 ఆగస్టులో చంద్రబాబు నివాసంపై భద్రతా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు ఎగురవేశారు. ఆయన ఇంటిపై జోగి రమేశ్‌ దాడికి యత్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్‌ల ఆదేశాలతో వైకాపా గూండాలు చంద్రబాబు కుప్పం పర్యటనలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్‌ల భద్రత ఏర్పాట్లను సమీక్షించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. లోకేశ్‌ వ్యక్తిగత భద్రతా బృందాల సంఖ్యను పెంచి పటిష్ఠ భద్రత కల్పించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ...బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న వైకాపా నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి...’’ అని వర్ల రామయ్య ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని