టీచర్లను దూరం పెట్టడంలో మర్మమేంటి?

పీఆర్సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది.

Published : 01 Dec 2022 05:12 IST

బోధనేతర విధులకు టీచర్లు వద్దంటూ విద్యాహక్కు చట్టానికి సవరణలు
ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చేయడానికే..
ఈటీవీ ప్రతిధ్వని చర్చలో నిపుణులు

ఈటీవీ, అమరావతి: పీఆర్సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అన్ని శాఖల ఉద్యోగులు పాలొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. ఎన్నికలకు టీచర్ల సేవలు అవసరం లేదని పరోక్షంగా సూత్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు ఏంటి? ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా? అయిదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధుల సంగతి అటుంచి ప్రతిరోజూ చికాకు పెట్టే యాప్‌ల భారం తొలగించాలంటున్న టీచర్ల వాదనను ఎలా చూడాలి? ఇదే అంశంపై బుధవారం ‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చ చేపట్టింది. ఇందులో పాల్గొన్న ప్రముఖులు ఏమన్నారంటే..


ప్రభుత్వ దుర్బుద్ధి బయటపడింది
-షేక్‌ సాబ్జీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

చట్టసభల నిర్మాణ ప్రక్రియలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ జరుగుతోంది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులు ఎంతో బాధ్యతాయుతంగా.. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అధిగమించి పాల్గొంటున్నారు. విద్యాహక్కు చట్టంలోనూ ఎన్నికల నిర్వహణ, పదేళ్లకు ఓసారి జరిగే జనాభా గణన రెండింటినీ ఉపాధ్యాయులు చేయాలని చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం తమకున్న అధికారంతో బోధనేతర విధుల పేరిట తొలగించింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా సవరణలు చేయలేదు. ఉపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ప్రభుత్వంపై వారికి ఉన్న అసంతృప్తిని బయటపెడతారనే దుర్బుద్ధితోనే ఇలా చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి రావాలంటే టీచర్లను ఎన్నికల విధుల నుంచి తొలగించాలనేది ఈ ప్రభుత్వ యోచన. వాస్తవానికి పోలింగ్‌ కేంద్రాల్లో ఏ ఉపాధ్యాయుడూ ఈవీఎంల దగ్గరకు కూడా వెళ్లరు. అన్నిచోట్లా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్‌, కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు ఆమోదిస్తాయనేది చూడాలి. సరిపడినంత మంది సిబ్బంది లేకపోతే ఉపాధ్యాయులను వినియోగించుకుంటామని చట్టసవరణలో మెలిక పెట్టారు. తమకు అనుకూలమైన వారిని విధుల్లో పెడతారా? వ్యతిరేకులను దూరంగా ఉంచుతారా అనేది చూడాలి. కరోనా సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వల్ల సుమారు 976 మంది ఉపాధ్యాయులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడు డీఏ బకాయిలు చెల్లించలేదు. భవిష్యనిధి (పీఎఫ్‌) మంజూరులో జాప్యం చేస్తోంది. తెలంగాణతో సమానంగా పీఆర్సీలో ఫిట్‌మెంట్‌ ఇవ్వాలన్నా నిరాకరించింది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామనే జీవో ఇవ్వడమేంటి? డీఏ ఎరియర్లు ఎప్పుడిస్తారో తెలియదు. పది నెలలుగా సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌ చెల్లించడం లేదు. ఉపాధ్యాయులను, ఉద్యోగులను కించపరిచేలా మంత్రులు మాట్లాడుతున్నారు. ఏ ఉద్యోగీ ప్రభుత్వ చర్యలపై సంతృప్తికరంగా లేరు. టీచర్లను దూరం పెట్టాలనే ఆలోచన నుంచి ప్రభుత్వం బయటపడడం కష్టమే అనుకుంటున్నాను. టీచర్లు ప్రశాంతంగా పాఠాలు చెప్పే పరిస్థితులు ఎక్కడా లేవు. 22 రకాల యాప్‌ల నిర్వహణ భారంతో సతమతమవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు మరింత అవస్థలు పడుతున్నారు. గతంలో బయోమెట్రిక్‌ హాజరు. ఇప్పుడు ఉపాధ్యాయులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ యాప్‌. తర్వాత పిల్లల హాజరుకు ఓ యాప్‌. మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, గుడ్లు, చిక్కీల వివరాల నమోదుకు ఇంకో యాప్‌. నాడు-నేడు రికార్డుల నిర్వహణకు మరో యాప్‌. ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడంతా జాబితా ఉంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని యాప్‌ల నిర్వహణ బాధ్యత నుంచి ఉపాధ్యాయులను తప్పించి వారిని పూర్తిగా తరగతుల్లో పాఠ్యాంశాల బోధనకే పరిమితం చేయాలి.


టీచర్లకు భయపడే చట్టసవరణ
- నాగరాజు పతకమూరు, సీనియర్‌ పాత్రికేయుడు

ఉపాధ్యాయులను చూసి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది. అందుకే చట్టసవరణ తీసుకొచ్చింది. అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఉపాధ్యాయులకు అయిదారు రోజులకు మించి పని ఉండదు. విద్యా సంస్థలను ఎన్నికల కోసం ఉపయోగిస్తారు కాబట్టి తరగతులకు సెలవులు ఇస్తుంటారు. అంటే బోధనకు అంతరాయం కలుగుతుందనే సమస్య కూడా లేదు. అయినా ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంటే వారంతా తమపై ఎంతో ఆగ్రహంగా ఉన్నారని ప్రభుత్వం భయపడుతున్నట్లే కనిపిస్తోంది. ఉపాధ్యాయులను ప్రభుత్వం నిత్యం వేధిస్తోంది. ఆందోళనలు చేస్తుంటే నిర్బంధించి, కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఉపాధ్యాయులపై ఇంతగా కక్ష సాధించిన దాఖలాల్లేవు. మిగిలిన ఉద్యోగుల కంటే టీచర్లు చాలా క్రమశిక్షణగా కర్తవ్యాన్ని పాటిస్తారు. కేవలం రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం ఇలా చేసింది. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించడానికే ఈ తంతు అనే వాదన వాస్తవమనే అంగీకరించాలి. మళ్లీ గెలవడానికి తమకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని వైకాపా చూస్తోంది. సచివాలయ వ్యవస్థలో తాము అనుకున్నవారిని కొన్ని వేల మందిని నియమించామని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఇప్పుడు వారిపై ఒత్తిడి తీసుకొచ్చి లబ్ధి పొందాలనే ఆలోచన ప్రభుత్వ పెద్దల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని