కొవిడ్‌ చికిత్స చేసిన వైద్యులకు జీతాలివ్వరా?

కొవిడ్‌ సమయంలో చికిత్స అందించిన వైద్యులకు జీతం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ నవంబర్‌ నెల జీతాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని, ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.

Published : 02 Dec 2022 02:53 IST

ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి జీతం ఎందుకు జప్తు చేయకూడదో చెప్పండి
ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: కొవిడ్‌ సమయంలో చికిత్స అందించిన వైద్యులకు జీతం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ నవంబర్‌ నెల జీతాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని, ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి మార్చి 20 వరకు కొవిడ్‌ విజృంభించిన సమయంలో సేవలందించిన తమకు జీతం బకాయిలు చెల్లించలేదంటూ ఒప్పంద వైద్యులు వి.గీత్‌సత్యసాయి స్వరూప్‌ మరో తొమ్మిది మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదించారు. బకాయిలపై పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. జాతీయ ఆరోగ్య మిషన్‌ ప్రధాన పరిపాలకుడి కార్యాలయం నుంచి బకాయిల విడుదల కోసం ఆర్థిక శాఖను మే 21, జూన్‌ 16, అక్టోబర్‌ 20, నవంబర్‌ 17న పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి జీతం ఎందుకు ఎటాచ్‌ చేయకూడదో చెప్పాలంటూ విచారణను ఈ నెల ఏడో తేదీకి వాయిదా వేశారు.

జిల్లాకో వృద్ధాశ్రమ నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే

తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-19 ప్రకారం జిల్లాకు ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ సహాయంతో(ఎయిడ్‌) ఎన్జీవోలు వృద్ధాశ్రమాలను నిర్వహిస్తున్నాయనే కారణంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టం మేరకు ఏపీలో ఆశ్రమాలు ఏర్పాటు చేయలేదంటూ న్యాయవాది రాపోలు భాస్కర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది వి.రఘు వాదించారు. ‘ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 72 వృద్ధాశ్రమాలు ఉన్నాయని తెలిపింది. వాటిలో 70 ప్రైవేటు, ఎన్జీవోల ఆధీనంలో ఉండగా, రెండింటినే ప్రభుత్వం నిర్వహిస్తోంద’ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ న్యాయవాది టీఎన్‌ రంగారావు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా లేదా ఎన్జీవోలకు సహాయం అందించి వృద్ధాశ్రమాలు నిర్వహించవచ్చన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ‘రాష్ట్ర ప్రభుత్వమే జిల్లాకు ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పి, నిర్వహించాలని చట్ట నిబంధనలు చెబుతున్నాయి. ఈ బాధ్యతను పొరుగు సేవల ద్వారా ఎన్జీవోలకు అప్పగించడం సరికాదు. చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పండి’ అని మహిళా, శిశుసంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని