కొత్త పనులకు నిధుల్లేవ్‌!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలకు నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. చీఫ్‌ ఇంజినీర్లు, ఆయా ప్రభుత్వ శాఖల సచివాలయ పాలనాధికారులు కొత్త పనులకు బడ్జెట్‌ ప్రతిపాదనలను సమర్పించవద్దని తేల్చి చెప్పింది.

Published : 02 Dec 2022 02:53 IST

ఎలాంటి ప్రతిపాదనలూ పంపొద్దు
చీఫ్‌ ఇంజినీర్లు, పాలనాధికారులకు ఆర్థిక శాఖ స్పష్టీకరణ  
చర్చనీయాంశమవుతున్న బడ్జెట్‌ మార్గదర్శకాలు
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం కరవు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎలాంటి నిర్మాణాలకు నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. చీఫ్‌ ఇంజినీర్లు, ఆయా ప్రభుత్వ శాఖల సచివాలయ పాలనాధికారులు కొత్త పనులకు బడ్జెట్‌ ప్రతిపాదనలను సమర్పించవద్దని తేల్చి చెప్పింది. ఆర్థికశాఖ అధికారులు తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సహజంగా కొత్త బడ్జెట్‌లో నిర్మాణాలు, ఆదాయాన్ని సృష్టించే కార్యక్రమాలకు మూలధన నిధులను అధికంగా ప్రతిపాదిస్తారు. ఈసారి జలవనరుల శాఖ ప్రాజెక్టులకు, సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యం దక్కకపోవడం గమనార్హం. ప్రాథమిక రంగాల్లో మాత్రమే మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇళ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, రవాణా వంటి అంశాలపైనే ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు, మూలధన వ్యయం కేటాయింపుల సమయంలో వీటిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా మధ్య తరహా అభివృద్ధి పథకాలు, మిషన్‌ లక్ష్యాలు ఉన్న వాటికే కేటాయిస్తామన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని చీఫ్‌ ఇంజినీర్లకు ఆన్‌లైన్‌లో ఒక ప్రొఫార్మా పంపారు. వారి శాఖల్లో ఉన్న పనులకు సంబంధించిన వివరాలను అందులో పొందుపరచాలని సూచించారు. ప్రొఫార్మాలో చేర్చిన పనులకు మాత్రమే నిధులు ఇస్తామని స్పష్టంచేశారు. చాలినంత బడ్జెట్‌ కేటాయింపులు లేకపోతే ఏ పనీ చేపట్టకూడదన్నారు.

కేంద్ర పథకాలకు విదిలింపే!

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపడం లేదు. కేంద్రం కొంత మొత్తం వాటా ఇస్తే దీనికి అదనంగా రాష్ట్రం తనవంతు వాటా కేటాయించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండా బడ్జెట్‌లో కేంద్ర పథకాలకు ఎలాంటి ప్రతిపాదనలను చూపరాదని స్పష్టంచేసింది. అయితే... కేంద్ర పథకాల్లో రాష్ట్ర ప్రాధాన్య కార్యక్రమాలు ఉంటే వాటిని కొనసాగించే ఉద్దేశంతో ఉంది. ఈ పథకాలకు నిధులు చూపించే క్రమంలో ఊహాజనిత లెక్కలు వేయవద్దని గుర్తుచేసింది. కిందటి ఏడాది కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో అవే మొత్తాలు లేదా, సిద్ధమైన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొన్న నిధులను పరిశీలించి... ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలంది. ఇప్పటికే రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందున అనేక కేంద్ర పథకాలకు కేంద్ర నిధులు ఆగిపోయాయి. తాజా మార్గదర్శకాలను పరిశీలించినా ఇదే ఒరవడి కొనసాగనున్నట్లు విశదమవుతోంది. కేంద్ర సాయంతో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఉద్యోగులకు సైతం జీతాల కేటాయింపును చూపొద్దని ఆర్థికశాఖ ఆదేశించడం గమనార్హం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని