Andhra News: మంత్రి గుమ్మనూరు దంపతులకు ఐటీ తాఖీదులు

రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ఆయన భార్య పెంచలపాడు రేణుకమ్మతోపాటు ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కూ అక్టోబరు 31న తాఖీదులిచ్చింది.

Updated : 02 Dec 2022 07:19 IST

ఒకేరోజు కుటుంబ సభ్యుల పేరిట 180 ఎకరాల కొనుగోళ్లు
30 ఎకరాలకు రూ.52.42 లక్షలు ఎలా సమకూర్చారని ప్రశ్న
వివాదాస్పద ‘ఇట్టినా’ భూముల లావాదేవీపై నోటీసు

ఈనాడు-కర్నూలు, ఆలూరు గ్రామీణం-న్యూస్‌టుడే: రాష్ట్ర కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ఆయన భార్య పెంచలపాడు రేణుకమ్మతోపాటు ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌కూ అక్టోబరు 31న తాఖీదులిచ్చింది. రేణుకమ్మకు ఎలాంటి ఆదాయ వనరు లేకపోయినా ఆమె పేరిట 30 ఎకరాల భూమిని రూ.52.42 లక్షలతో కొనుగోలు చేయడానికి డబ్బు ఎలా వచ్చిందో 90 రోజుల్లో సమాధానమివ్వాలని పేర్కొంది. ‘ఇట్టినా మంజునాథ నుంచి ఈ భూమి కొన్నాను’ అని మంత్రి జయరాం గతంలో మీడియాతో చెప్పినట్లు ఆధారాలు ఉన్నాయని, ఈ లావాదేవీలో ఆయనే తొలి లబ్ధిదారు అని నిర్ధారించుకున్నాకే నోటీసు ఇస్తున్నట్లు ప్రస్తావించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలో 674/ఇ, 729, 666/2, 668/సి, 669/సి, 713/ఏ సర్వే నంబర్లలోని 30.83 ఎకరాల భూమి 2020 మార్చి 2న రేణుకమ్మ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అదేరోజు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల పేరుతోనూ 180 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రేణుకమ్మ ఎలాంటి ఆదాయ వనరులు చూపించకపోగా, రూ.52.42 లక్షలతో ఎలా కొనుగోలు చేశారన్నది ఐటీ శాఖ అభియోగం. ఈ భూములను మంత్రి జయరాం కొని, తన భార్యతోపాటు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారని గుర్తించిన ఐటీ అధికారులు.. ప్రొహిబిషన్‌ ఆఫ్‌ బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్‌ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘నోటీసులకు 90 రోజుల్లో సమాధానం చెప్పాలి. అప్పటి వరకు స్పందించకుంటే ఆ ఆస్తిని మూడో వ్యక్తికి బదలాయించకుండా జప్తు చేసే అధికారం ఉంది’ అని నోటీసుల్లో పేర్కొంది.

భూములపై రెండేళ్లుగా వివాదం

బెంగళూరుకు చెందిన ‘ఇట్టినా ప్లాంటేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కొన్నేళ్ల క్రితం కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని చిన్నహోతూరు, పెద్దహోతూరు, ఆస్పరి పరిసర రైతుల నుంచి 454.37 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ కంపెనీ డైరెక్టరు మనుకు చిన్నాన్న వరసైన మంజునాథ్‌ పలువురికి ఆ భూముల్లో కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించారు. అలా కొనుగోలు చేసిన వారిలో మంత్రి కుటుంబసభ్యులూ ఉన్నారు. భూములు అమ్మిన వ్యక్తికి కంపెనీతో సంబంధం లేదంటూ డైరెక్టర్లు ఇట్టినా మను, మోనాలు అప్పట్లోనే ఆలూరు సబ్‌రిజిస్ట్రార్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నకిలీ డాక్యుమెంట్లతో బోర్డు తీర్మానం ఆధారంగా ఆస్తులు అమ్మేశారని, ఆ లావాదేవీలు చెల్లవంటూ ప్రకటన ఇచ్చారు. బెంగళూరులోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ భూములు తన భార్య రేణుకమ్మ, బంధువులు త్రివేణి, ఉమాదేవి, సన్నిహితుడైన అనంత పద్మనాభరావు పేరిట రిజిస్ట్రేషన్‌ కావడంపై మంత్రి జయరాం గతంలో వివరణ ఇచ్చారు.

నాకు నోటీసులు రాలేదు: మంత్రి జయరాం

ఐటీ శాఖ నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాకున్నా, వచ్చాయని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఐటీ అధికారులు అడిగితే ఆధారాలు చూపిస్తాం. నేను దోపిడీ, దౌర్జన్యం చేయలేదు. బినామీలు లేరు. అంతా నా భార్య, సోదరుల భార్యల పేరిట కొన్నమాట నిజం. ఇది బినామీ చట్టం కిందకు రాదు. ఇట్టినా ప్లాంటేషన్‌ సంస్థ 15-20 ఏళ్ల క్రితమే రైతుల నుంచి భూములు కొనుగోలు చేసింది. ఆ బీడు భూములను ఇట్టినా సంస్థకు చెందిన మంజునాథ్‌, ఆయన అన్న కుమారుడు మను నా దగ్గరికి వచ్చి కొనాలని కోరారు. సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ కార్యాలయాల్లో విచారించాకే నా కుటుంబ సభ్యుల పేరిట కొన్నాను. న్యాయబద్ధంగా లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎలా అవుతాయి? 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా, 2014లో ఎమ్మెల్యేగా, 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్నా. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల వంద ఎకరాల భూమి ఉంది. ఆ పొలంపై ఆదాయం, నా జీతం డబ్బులతో పాటు కొంత అప్పు తీసుకుని కొన్నాను. ఉమ్మడి కుటుంబం ఉన్న రైతు ఎకరా రూ.1.50 లక్షలతో భూమి కొనుగోలు చేయకూడదా?


‘ఇట్టినా’ భూములపై 2020లో తెదేపా ఓ కమిటీ వేసింది. ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు ఇన్‌ఛార్జి కోట్ల సుజాతమ్మ అప్పట్లో రైతులతో మాట్లాడారు. తాను ఎన్నికల్లో గెలిస్తే ఇట్టినా నుంచి భూములను తిరిగి ఇప్పిస్తానని చెప్పిన జయరాం.. తీరా గెలిచి మంత్రి అయ్యాక ఆయనే కొన్నారంటూ అప్పట్లో రైతులు కమిటీ ఎదుట వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు