ఆంధ్రా క్రికెట్‌ సంఘం కార్యవర్గ ఎన్నికల ఫలితాలపై స్టే

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) నూతన కార్యవర్గం (ఎపెక్స్‌ కౌన్సిల్‌) ఎన్నికల ఫలితాలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

Updated : 02 Dec 2022 05:56 IST

శరత్‌చంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) నూతన కార్యవర్గం (ఎపెక్స్‌ కౌన్సిల్‌) ఎన్నికల ఫలితాలను నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ వరకు ప్రస్తుత కార్యవర్గం బీసీసీఐ నిధులు అందుకోవచ్చని, రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఏసీఏ పూర్వ అధ్యక్షుడు పి.శరత్‌చంద్రారెడ్డికి (అరబిందో గ్రూప్‌ డైరెక్టర్‌) నోటీసులిచ్చింది. విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ గురువారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ఏసీఏ పూర్వ అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డిని పదవులు నిర్వహించేందుకు అనర్హుడిగా ప్రకటించాలంటూ చిత్తూరు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బి.విజయ్‌కుమార్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. బీసీసీఐ కార్యదర్శి, ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, చిత్తూరు జిల్లా బాలబాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. క్రిమినల్‌ కేసు ఉన్నందున శరత్‌చంద్రారెడ్డి ఏసీఏ ఆఫీసుబేరర్‌గా/కమిటీ సభ్యుడిగా/బీసీసీఐ ప్రతినిధిగా అనర్హుడవుతారని పేర్కొన్నారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గంగయ్యనాయుడు వాదనలు వినిపించారు. ఏసీఏ కార్యవర్గం కాలపరిమితి ఈ ఏడాది సెప్టెంబరు 29తో ముగిసిందని, నిబంధనలను ఉల్లంఘిస్తూ జనరల్‌బాడీ సమావేశాన్ని నిర్వహించి పదవీకాలాన్ని పొడిగించుకున్నారని వివరించారు. జస్టిస్‌ లోథా కమిటీ సిఫారసుల మేరకు కేవలం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్లకు మాత్రమే ఓటు హక్కు ఉండగా, ప్రైవేట్‌ క్రికెట్‌ క్లబ్బులకూ ఈ హక్కు కల్పించారన్నారు. ఓటు హక్కు ఉన్నవారితో కుమ్మక్కై వివిధ పోస్టులకు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యేలా చూసుకున్నారని తెలిపారు. జస్టిస్‌ లోథా కమిటీ సిఫారసులకు భిన్నంగా నవంబరు 18న ఎన్నిక జరిగిందని ఆరోపించారు. ఈ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ఈ నెల 3న ఫలితాలు ప్రకటించే అవకాశముందని వివరించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎన్నికల ఫలితాల వెల్లడిపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు