ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఫార్మెటివ్‌ పరీక్ష ఎలా?

రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులకు ఫార్మెటివ్‌-2 పరీక్షలు సమస్యగా మారాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated : 02 Dec 2022 05:49 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులకు ఫార్మెటివ్‌-2 పరీక్షలు సమస్యగా మారాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల నిర్వహణపై ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఉమ్మడి ప్రశ్నపత్రాలను సిద్ధం చేసింది. వీటిని వాట్సప్‌ల్లో పంపిస్తామని, బోర్డుపై రాసి విద్యార్థులకు అందించాలని సూచించింది. ప్రశ్నపత్రాలను ముద్రించేందుకు ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో పంపించేందుకు నిర్ణయం తీసుకుంది. 1-10 తరగతుల వరకు ఆయా ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నపత్రాలను పరీక్షకు గంట ముందు మాత్రమే వాట్సప్‌ల్లో పంపిస్తారు. రాష్ట్రంలో 12వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 1-5 తరగతులు, 1,2 తరగతులు ఉన్నవి ఉన్నాయి. ఇలాంటి చోట్ల ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను బోర్డుపై రాసేందుకే చాలా సమయం పడుతుంది. ఒకే టీచర్‌ ఐదు తరగతుల విద్యార్థులకు బోర్డుపై ప్రశ్నలు రాయడం, పరీక్ష నిర్వహించడం కష్టంగా మారనుంది. పరీక్ష ఎలా నిర్వహించాలనే దానిపై స్పష్టత కోరితే పాఠశాల విద్యాశాఖ ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని పలువురు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు.  కనీసం ప్రశ్నపత్రాలను జిరాక్స్‌ తీసి, ఇవ్వాలన్న గంటన్నర వరకు సమయం పడుతుందని, వీటికి అయ్యే వ్యయం తామే భరించాల్సి వస్తుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని