సంక్షిప్త వార్తలు (19)
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల అకస్మిక బదిలీలను నిలిపేయాలని హైకోర్టు వద్ద న్యాయవాదులు నినాదాలు చేశారు.
న్యాయమూర్తుల బదిలీలను నిలిపేయాలి
హైకోర్టు వద్ద న్యాయవాదుల నినాదాలు
ఈనాడు, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్‌ల అకస్మిక బదిలీలను నిలిపేయాలని హైకోర్టు వద్ద న్యాయవాదులు నినాదాలు చేశారు. గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో న్యాయవాదులు ఒకచోట చేరి బదిలీ సిఫారసులపై నిరసన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని నినదించారు. బదిలీలపై సుప్రీంకోర్టు కొలీజియం పునరాలోచించాలని కోరారు. ఏపీ అడ్వొకేట్స్ ఐకాస కన్వీనర్లు వై.కోటేశ్వరరావు, జడ శ్రవణ్‌కుమార్, వాసిరెడ్డి ప్రభునాథ్, జీవీ శివాజీ, డీఎస్‌ఎన్వీ ప్రసాదబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కోటి నాగులు, సైకం రాజశేఖర్, జై భీమారావు, గోళ్ల బాలాజీ, పుల్లగూర నాగరాజు, కోటా వెంకటరామారావు, ఎం.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కడప-చిన్న ఓరంపాడు మధ్య జాతీయ రహదారి విస్తరణ
రూ 1,500 కోట్లతో పనులు
కేంద్రమంత్రి గడ్కరీ ట్వీట్
ఈనాడు, దిల్లీ: కడప-చిన్న ఓరంపాడుల మధ్య జాతీయ రహదారి (ఎన్‌హెచ్-716)ని నాలుగు వరసలుగా విస్తరించడానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్వీట్ చేశారు. ఇందుకు రూ1500.11 కోట్లు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల రవాణా సమయం తగ్గి వాహన నిర్వహణ ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయని, సురక్షిత మార్గం అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఈ రహదారి ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సోలాపుర్-చెన్నై ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా కడప-రేణిగుంట మధ్య నిర్మిస్తున్న నాలుగు వరసల జాతీయరహదారి వల్ల ఆ రెండు పట్టణాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని చెప్పారు.
సచివాలయాల్లో అవినీతికి తావులేకుండా సేవలు అందించాలి
మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశం
ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో సంక్షేమ పథకాలు, పౌర సేవల్లో అవినీతికి ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ‘విధి నిర్వహణలో అధికారులు, సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలి. సచివాలయాల్లో అందిస్తున్న సేవలపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలి. సేవలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేలా సదస్సులు నిర్వహించాలి’ అని మంత్రి సూచించారు. సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే పాల్గొన్నారు.
సున్నా వడ్డీపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం: వ్యవసాయశాఖ
ఈనాడు, అమరావతి: పంటరుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వినియోగించుకునేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ తెలిపింది. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని, రూ.లక్ష లోపు రుణం తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతుల పొదుపు ఖాతాలకు 4% వడ్డీ జమ చేస్తోందని తెలిపింది. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో గురువారం వచ్చిన ‘సున్నా వడ్డీ పెద్ద సున్నా’ కథనంపై వ్యవసాయశాఖ వివరణ ఇచ్చింది. సున్నా వడ్డీ రాయితీ కింద 2019 నుంచి ఇప్పటి వరకు రూ.73.88 లక్షల మంది రైతులకు రూ.1,838.61 కోట్లు అందించినట్లు పేర్కొంది.
మంత్రి కార్యక్రమానికి హాజరు కాకపోతే జరిమానా వేస్తాం
రిసోర్స్‌పర్సన్ హెచ్చరికలు వైరల్
డోన్ పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా డోన్ పురపాలక పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొనే కార్యక్రమాలకు రావాలంటూ మెప్మా రిసోర్స్‌పర్సన్ ఫోన్ సంభాషణ గురువారం వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. ‘రహదారి ప్రారంభోత్సవానికి మంత్రి రాజారెడ్డి అన్న (బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి) వస్తున్నారు. కొండపేటలో మల్లప్ప జిన్ను వద్దనున్న ఏడో సచివాలయం పరిధిలోని పొదుపు మహిళలు గ్రూప్‌నకు పది మంది చొప్పున రావాలి. ఇక్కడ సంతకాలు పెట్టించుకుంటా. ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో చూస్తా. ఈసారి కథలు చెప్పి కారణాలు చెబితే ఒప్పుకోను. గ్రూప్ మీటింగ్‌లో ఫైన్ తప్పనిసరిగా ఉంటుంది. నా మీద దయ ఉంచి అందరు సభ్యులు వచ్చేయండమ్మా.. 9:30 గంటలకల్లా మా ఇంటి వద్దకు రండి. మన పని మనమే చూసుకోవాలి..’ అని పొదుపు మహిళలకు పంపిన ఆడియోలో పిలుపునిచ్చారు.
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా సంపత్‌కుమార్
వెంకటాచలం, న్యూస్‌టుడే: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లాలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్‌ను నియమించారు. ఆ మేరకు మైసూరులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ చౌదరి ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు పనిచేసిన ఆచార్య మునిరత్నం నాయుడు పదవీకాలం గత నెల 27తో ముగిసింది. సంపత్‌కుమార్ మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడిగానూ పనిచేశారు. శుక్రవారం బాధ్యతలు తీసుకోనున్నారు.
పులివెందులలో అభివృద్ధి పనులకు అదనపు నిధులు
ఈనాడు-అమరావతి: పాడా (పులివెందుల పట్టణాభివృద్ధి ఏజెన్సీ)కి నిధుల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రాజెక్టులను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్, పాడా ఛైర్మన్‌కు సూచిస్తూ ప్రణాళికశాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి విజయ్‌కుమార్ గురువారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రింగ్‌రోడ్డుకు రూ.42 కోట్లు, ప్రధాన రహదారులకు రూ.51.93 కోట్లు, నాలుగు లైన్ల వంతెనకు రూ.7కోట్లు, సిటీ సెంట్రంకు రూ.87.50 కోట్లు కలిపి మొత్తం రూ.188.43 కోట్లు కేటాయించారు. గతంలో వివిధ పనులకు రూ.133.38 కోట్లకు ఆమోదం ఇవ్వగా.. ఇప్పుడు వాటికి అదనంగా గరుడ నదిలో మూడో ప్యాకేజికి రూ.8.40 కోట్లు, ఉలిమెల్ల చెరువు మూడో ప్యాకేజీకి రూ.21 కోట్లు ఇచ్చారు. గతంతో పోలిస్తే రూ.30 కోట్లు పెంచారు. హౌసింగ్ లేఔట్‌లో తాగునీటి సరఫరా, రహదారులు, డ్రెయిన్లు, మార్కెట్లు, సిటిజన్ సర్వీస్ సెంటర్ తదితర పనులకు గతంలో రూ.251.16 కోట్లకు అనుమతివ్వగా.. ఇప్పుడు రూ.265.78 కోట్లకు, నైపుణ్య శిక్షణ అకాడమీకి రూ.30 కోట్లు కేటాయించగా.. దానిని రూ.32.82 కోట్లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
విద్యార్థుల పాస్‌లకు అదనంగా వసూలు చేస్తే చర్యలు
ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశం
ఈనాడు-అమరావతి: విద్యార్థుల బస్‌పాస్‌ల జారీ సమయంలో కౌంటర్లలో నిర్దేశిత మొత్తం కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తే సంబంధిత కాంట్రాక్టరుపై చర్యలు తీసుకొని, జరిమానాలు విధించాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) బ్రహ్మానందరెడ్డి అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. చిత్తూరు బస్టాండ్‌లో బస్‌పాస్ కౌంటర్‌లో ఉండే కాంట్రాక్టు సంస్థకు చెందిన సిబ్బంది.. విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించడంతో.. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు.
రేపు డయల్ యువర్ ఈవో
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య స్థానిక అన్నమయ్య భవనంలో జరగనుంది. భక్తులు 0877-226361 నంబరుకు ఫోన్‌చేసి తమ సందేహాలు, సూచనలను తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డికి తెలపవచ్చు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ధాన్యం ఎగుమతికి సమన్వయంతో పనిచేయండి
అధికారులతో సమీక్షలో మంత్రి కారుమూరి
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేరళతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సూచించారు. గురువారం ఆయన సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి.. ధాన్యం కొనుగోలులో రైతుల ఇబ్బందులు, సేకరించిన ధాన్యాన్ని ఎగుమతి చేయడంపై వ్యవసాయ, పౌరసరఫరాలు, భారత ఆహార సంస్థ, ఎగుమతి శాఖల అధికారులతో వీడియో సమావేశంలో సమీక్షించారు. ఎగుమతి రకాల ధాన్యం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వాటి సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, ఎండీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీ బీఈడీ స్పాట్ ప్రవేశాలు 8న
ఈనాడు, అమరావతి: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే బీఈడీ(ఎస్‌ఈ) కోర్సులో ప్రవేశాలకు పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈనెల 8న స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ అభ్యసక సహాయ సేవా కేంద్రం ఇన్‌ఛార్జి డైరెక్టర్ విజయకృష్ణారెడ్డి తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు విడతల ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించామని, మిగిలిన 53 సీట్లను స్పాట్ ప్రవేశాలతో భర్తీ చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే ప్రవేశాలు పొందిన అభ్యర్థులు మరో కోర్సుకు మారేందుకు స్లైడింగ్‌కు అనుమతిస్తామని, రిజర్వేషన్, ర్యాంకుల ఆధారంగా స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామని తెలిపారు.
కోరుకొండ సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్షకు గడువు పొడిగింపు
విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరంలోని కోరుకొండ సైనిక్‌స్కూల్ ప్రవేశ పరీక్ష జనవరి 8, 2023న జరగనుందని ప్రిన్సిపల్ కల్నల్ అరుణ్‌కులకర్ణి ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువును డిసెంబరు 5 వరకు పొడిగించామని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా ప్రవేశపరీక్ష నిర్వహిస్తుందని చెప్పారు.
కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ప్రవీణ్‌కుమార్
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవల వరకూ సభ్య కార్యదర్శిగా పనిచేసిన విజయ్‌కుమార్ నవంబరు 30న పదవీ విరమణ చేశారు. దీంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఉద్యోగుల బకాయిలపై దృష్టి సారించాలి: బొప్పరాజు
ఈనాడు, అమరావతి: పీఆర్సీ, డీఏ బకాయిలు, జీపీఎఫ్ రుణాలు మంజూరుపై దృష్టి సారించాలని సీఎస్ జవహర్‌రెడ్డిని ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు కోరారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి సీఎస్‌ను కలిశారు.
పెన్షనర్లకు డీఆర్ ఇవ్వాలని వినతి
ఈనాడు, అమరావతి: పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఆర్‌ను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైదరాబాద్‌లో స్థిరపడిన పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు విన్నవించారు. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఆర్‌ను విడుదల చేయాలని, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పే కమిషన్ బకాయిలకు నిరీక్షణ
చెల్లించాలంటూ వైద్యుల వేడుకోలు
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేసే వైద్యులకు ‘సెంట్రల్ పే కమిషన్’ను అనుసరించి బకాయిల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బోధనాసుపత్రుల్లో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లుగా సుమారు మూడు వేల మంది పనిచేస్తున్నారు. వీరికి 2016 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ పే కమిషన్ ప్రకారం వేతనాలు పెంచాల్సి ఉండగా, నిర్ణయం తీసుకోవడంలోనే జాప్యమైంది. వైద్యుల ఆందోళనలతో కిందటేడాది మార్చి 1 నుంచి పెరిగిన వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 2016 నుంచి పెరగాల్సి ఉన్నందున ఆ మేరకు బకాయిలు (2021 ఫిబ్రవరి వరకు) వెంటనే చెల్లించాలని వైద్యులు కోరుతున్నారు. ఒక్కో వైద్యుడికి కనీసం రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా మురళీమోహన్
ఈనాడు-అమరావతి: ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ (పరిపాలన విభాగం)గా డి.మురళీమోహన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఆయన డైరెక్టర్‌గా పదోన్నతి పొంది.. కొత్త పోస్టులో నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఉత్తర్వులిచ్చారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపునకు 19 వరకు అవకాశం
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 19వరకు అవకాశం కల్పించినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరి బాబు తెలిపారు. అపరాధ రుసుము రూ.120తో 26 వరకు, రూ.500తో జనవరి 2, రూ.వెయ్యితో జనవరి 9, రూ.2వేలతో 17, రూ.3వేలతో 23, రూ.5వేలతో జనవరి 30 వరకు చెల్లించొచ్చు. పరీక్ష ఫీజు దరఖాస్తుకు రూ.10, పరీక్ష ఫీజు కింద రూ.720 చెల్లించాలని సూచించారు.
జైన్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు
ఈనాడు డిజిటల్, అమరావతి: మైనార్టీ వర్గాల్లోని జైనులకు సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. 56 బీసీ కార్పొరేషన్ల తరహాలోనే సొసైటీ చట్టం కింద ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు
-
Crime News
Crime News: పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం.. తెదేపా మండలాధ్యక్షుడికి గాయాలు
-
Sports News
Usman Khawaja: వీసా ఆలస్యంతో ఆస్ట్రేలియా ఓపెనర్ అసంతృప్తి.. ఫన్నీ పోస్ట్ వైరల్
-
Movies News
Kiara Sidharth Malhotra: కియారా- సిద్ధార్థ్‌ల వివాహం అప్పుడేనా? శరవేగంగా పనులు..!