సజ్జల, మంత్రులు చేస్తున్న కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై చర్యలుండవా?

రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్పీపై స్టే ఇవ్వకపోయినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు మంత్రులు మూడు రాజధానులపై చేస్తున్న కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై చర్యలు తీసుకోరా?

Updated : 02 Dec 2022 05:18 IST

అమరావతి బహుజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు బాలకోటయ్య ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాజధాని అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్‌ఎల్పీపై స్టే ఇవ్వకపోయినా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు మంత్రులు మూడు రాజధానులపై చేస్తున్న కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై చర్యలు తీసుకోరా? అని అమరావతి బహుజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ధ్వజమెత్తారు. ఒకపక్క న్యాయస్థానాల తీర్పులను గౌరవిస్తామంటూనే, మరో పక్క తీర్పులకు వక్రభాష్యం చెబుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు లేదని సుప్రీంకోర్టుకు చెప్పి, మళ్లీ న్యాయరాజధాని అనడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.‘‘మూడు రాజధానులు పెడతాం, విశాఖ వెళ్లి తీరుతాం అంటూ మంత్రులు మాట్లాడటాన్ని కోర్టులు సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలి. సజ్జల, మంత్రులు చేస్తున్న ప్రచారాన్ని న్యాయస్థానాలు అదుపు చేయకపోతే  కోర్టులపై  ప్రజల్లో నమ్మకంపోయే ప్రమాదం ఉంది.  ప్రజల్లో ప్రాంతీయ వైషమ్యాలు కలిగించేలా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారు. సీఎం సభలు పరదాలు, బారికేడ్ల దశ దాటి కందకాలు తవ్వే దుస్థితికి చేరింది. 30 ఏళ్లు అధికారంలో ఉంటామని, 175 సీట్లు గెలుస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నాయకులు దీనిపై సమాధానం చెప్పాలి. మూడు రాజధానుల గురించి మాట్లాడటం ఆపాలి’’ అని బాలకోటయ్య పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని