మీ మమకారం మరవలేను!

‘మీ మమకారం ఎన్నటికీ మరవలేను’ అని వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతలతో సీఎం జగన్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Published : 03 Dec 2022 04:49 IST

పులివెందుల నేతలతో సీఎం జగన్‌
నాయకులు, అధికారుల మధ్యే పర్యటన
ప్రజలకు దూరంగా కార్యక్రమం

ఈనాడు డిజిటల్‌, కడప: ‘మీ మమకారం ఎన్నటికీ మరవలేను’ అని వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతలతో సీఎం జగన్‌ తన సంతోషాన్ని పంచుకున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణానంతరం అందరూ ఆదరించి మనోధైర్యం నింపడంతో ఈ రోజు ముఖ్యమంత్రిగా నిలబడ్డానని వారితో ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అభిమానం చాటాలని విజ్ఞప్తి చేశారు. లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్దకు శుక్రవారం చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. పర్యాటక శాఖ చేపట్టిన నిర్మాణాలను ప్రారంభించారు. పాడా నిధులతో నిర్మించిన వైయస్‌ఆర్‌ లేక్‌వ్యూ రెస్టారెంట్‌, పార్కు, నాలుగు సీట్ల స్పీడ్‌ బోట్లు, 18 సీట్ల బోటింగ్‌ జెట్టీకి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. లేక్‌వ్యూ పార్కులో ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పర్యాటకుల అతిథి గృహాలను ప్రారంభించిన అనంతరం లేక్‌వ్యూ పాయింట్‌ నుంచి రిజర్వాయరుతో పాటు ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రిజర్వాయరులో పడవ షికారు చేశారు. ప్రసిద్ధ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాంతం ఎంతో అనువైందని, ఇక్కడ అన్ని రకాల వనరులూ సమృద్ధిగా ఉన్నాయని, జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించే విధంగా పర్యాటక శాఖ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం లింగాల మండల నేతలతో సీఎం భేటీ అయ్యారు. గ్రామ పంచాయతీల వారీగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇడుపులపాయలో రాత్రి బస చేశారు.  పర్యటనలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఎంపీ అవినాష్‌రెడ్డి,  కలెక్టరు విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, ఎస్పీ అన్బురాజన్‌ తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో శనివారం ఉదయం తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ కుమార్తె వివాహానికి హాజరై తిరుగు ప్రయాణం కానున్నారు.

నేతలు, అధికారుల మధ్యే కార్యక్రమం

ముఖ్యమంత్రి పర్యటనకు అధికారులు, నేతలను కొద్ది మందిని మాత్రమే అనుమతించారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు వద్ద దాదాపు అయిదు గంటలకుపైగా గడిపిన సీఎంను కలవడానికి వివిధ జిల్లాల నుంచి ప్రజలు తరలిరాగా ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. కేవలం ఎంపిక చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించారు. ప్రవేశ ద్వారం వద్ద జాబితాలో పేర్లున్న వారిని మాత్రమే అనుమతించారు. సొంత నియోజకవర్గానికి వచ్చినా... సీఎంను చూసే భాగ్యం  లేకుండా పోయిందంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని