నీటి లెక్క తేలుతుందా?

కృష్ణా బేసిన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనేందుకు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) తుది సమావేశం శనివారం జరగనుంది.

Updated : 03 Dec 2022 06:03 IST

నేడు శ్రీశైలం, సాగర్‌ నిర్వహణపై ఆర్‌ఎంసీ సమావేశం

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకొనేందుకు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) తుది సమావేశం శనివారం జరగనుంది. కృష్ణా నదీ యాజమాన్యబోర్డులో కీలక అధికారి రవికుమార్‌ పిళ్లై నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నీటిపారుదల, జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్లు సభ్యులుగా ఉన్నారు. పవర్‌హౌస్‌ల నిర్వహణ, వరద నీటి వినియోగం, రిజర్వాయర్ల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఆరు నెలల క్రితం బోర్డు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అయిదు సమావేశాలు జరగ్గా, ఆరో సమావేశం 3వ తేదీన జరగనుంది. గత సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకాలేదు. ఈ చివరి సమావేశానికీ హాజరుకాని పక్షంలో ఓ అభిప్రాయానికి రాలేకపోయామని బోర్డుకు నివేదించే అవకాశం ఉంది. కమిటీకి నేతృత్వం వహిస్తున్న పిళ్లై సమావేశంలో చర్చించాల్సిన విద్యుదుత్పత్తి, రూల్‌కర్వ్‌, వరద నీటి వినియోగం, నీటిమట్టాల నిర్వహణపై ముసాయిదాను ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులకు పంపారు. దీని ప్రకారం జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులకు పైనే ఉండాలి. మిగిలిన సమయంలో విద్యుత్తు అవసరాలకు తగ్గట్లుగా దిగువన నీటిని తీసుకోవచ్చు... కానీ తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ 815 అడుగుల కంటే దిగువకు నీటిని తీసుకోకూడదు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నిండి గేట్లు ఎత్తినపుడు తీసుకొనే నీటిని మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని వివిధ రిజర్వాయర్లకు మళ్లించవచ్చు. ఈ నీటిని ఏ రాష్ట్రం ఎంత మళ్లించిందీ లెక్కల్లోకి తీసుకొంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పవర్‌హౌస్‌ల నిర్వహణపై కూడా పలు కీలక ప్రతిపాదనలు ముసాయిదాలో ఉన్నాయి. దిగువన సాగు, తాగునీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. శ్రీశైలంలో ఉన్న రివర్సబుల్‌ టర్బైన్స్‌ వల్ల ఎడమగట్టు విద్యుత్తు కేంద్రంలో 13 శాతం నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని,  దిగువన ఒక టీఎంసీ నీరు అవసరమైతే  ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి 0.531 టీఎంసీ, కుడివైపు నుంచి 0.469 టీఎంసీ నీటితో విద్యుదుత్పత్తి జరుగుతుందని పేర్కొంది. ఈ అంశాలపై రెండు రాష్ట్రాలు అంగీకరించి సంతకాలు చేస్తే అమలులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని