ఎందరికో జీతాలు, పింఛన్లు అందలేదు!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా చాలా మందికి నవంబరు నెల జీతాలు అందలేదు.

Published : 03 Dec 2022 03:49 IST

రూ.1,600 కోట్ల మేరకే చెల్లింపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇంకా చాలా మందికి నవంబరు నెల జీతాలు అందలేదు. కొందరు విశ్రాంత ఉద్యోగులు కూడా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబరు నెలలో రెండ్రోజులు గడిచినా జీతాల అతీగతీ లేదు. రాష్ట్రంలో అనేక నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. కనీసం ఫలానా తేదీకి అందుతుందనే నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు కలిపి నెలకు దాదాపు రూ.5,500 కోట్ల మేర జీతాలు, పింఛన్లు, గౌరవ వేతనాల చెల్లింపులకు అవసరమవుతాయని అంచనా. ప్రస్తుతం రూ.1,600 కోట్ల జీతాలు, రూ.1,000 కోట్ల పింఛన్లు మాత్రమే చెల్లింపులు జరిగాయని సమాచారం. అందరికీ చెల్లింపులు చేయాలంటే ఇంకా రూ.2,900 కోట్ల వరకు అవసరమవుతాయి. ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో నిధులు అందుబాటులో లేకపోవడం వల్లే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని తెలిసింది.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ భయం...: ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వెసులుబాట్లు ఉపయోగించుకుంది. ఇక డబ్బులు డ్రా చేస్తే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఆర్బీఐ మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల రుణం సమీకరించింది. ఈ నిధులతో పాటు మరో 2,700 కోట్లు వేరే మొత్తాలు అందినట్లు సమాచారం. ఈ నిధులన్నీ కలిసి సామాజిక పింఛన్లు, కొందరికి జీతాలు చెల్లించారు. ఇంకా రూ.2,900 కోట్ల చెల్లింపులు జరపాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 9 నెలల కాలానికి కేంద్రం ఇచ్చిన రుణ పరిమితి పూర్తయింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేసినందుకు ఇచ్చే వెసులుబాటులో భాగంగా కిందటి మంగళవారం రుణం సమీకరించారు. వచ్చే మంగళవారం రుణానికి అవకాశం లేకుండా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జీతాలకు, పింఛన్లకు ఎలా సర్దుబాటు చేస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. టీచర్లలోనే పెద్ద సంఖ్యలో జీతాలు అందవలసి ఉందని చెబుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు